భయం, భక్తులతో సినిమాలు తీసినందుకే ఈ అవార్డు – కె. విశ్వనాథ్

  • ‘కాశీ’ విశ్వనాథుని ‘నంది’ ప్రతిరూపమే ఈ పురస్కారం

సంగీతం, సాహిత్యం, నాట్యం మొదలైన కళా రూపాలనే కథావస్తువులుగా తెరకెక్కించిన కళాతపస్వి కె. విశ్వనాథ్. సినిమారంగంలోనే అగ్రగామి అవార్డుగా ఖ్యాతికెక్కిన ‘దాదా సాహెబ్ ఫాల్కే’ ఈ సంవత్సరం కాశీ విశ్వనాథుని వరించింది. ఇంతవరకు ఈ అవార్డులు పొందిన ఎల్.వి. ప్రసాద్, బి. నాగిరెడ్డి, బి. ఎన్. రెడ్డి వంటి దిగ్దంత దర్శకులు, అక్కినేని వంటి తెలుగు శిఖరాల సరసన నేడు కె. విశ్వనాథ్ చేరారు.

“మడి కట్టుకొని కృష్ణా, గోదావరి నదుల ఒడ్డునే నేను సినిమాలు తీస్తాను, నా సినిమా కథలన్నీ భారతీయ సంస్కృతి చుట్టే తిరుగుతాయని“ కె. విశ్వనాథ్ ఇప్పటికీ అంటున్నారు. అవార్డు వచ్చిన సందర్భంగా మీడియాతో ఆయన కొంచెంసేపు తన భావాలను పాలుపంచుకున్నారు. “నా కంటే ప్రేక్షకులే ఆనందం చెందుతున్నారని, అంతకు మించిన అవార్డు  ఇంకేముంటుంది” అని కళాతపస్వి స్పందించారు. ఈ అవార్డు నేను ఊహించింది కాదు, ఆశించింది కాదు. ఫిలిమ్స్ డివిజన్ వారు ఫోన్ చేసి అవార్డుకి మీరు ఎంపిక అయ్యారు అని చెప్పారు. కానీ నేను నమ్మలేదు. మళ్లీ రెండోసారి చేశారు. అప్పుడు నమ్మకం కుదిరింది. ఇంత పెద్ద అవార్డు నాకు వచ్చిందని అనిపించగానే నా కళ్లలో నాకు మొట్టమొదటగా మెదిలింది నా తల్లిదండ్రులు. వారికెప్పటికీ కృతజ్ఞుడినే. వారు నా కెరీర్ పట్ల ఎంతో భయపడ్డారు –  అంటూ విశ్వనాథ్ ఉద్వేగానికి గురయ్యారు.

‘శంకరాభరణం’… వంటి సినిమాలు తీయడానికి, “ప్రాగ్దిశ వీణియ పైన“… వంటి పాటలు రాయించడానికి నాకు స్వేచ్ఛ నిచ్చిన నిర్మాతలే నా ఎదుగుదలకు మూల స్తంభాలని ఆయన గుర్తు చేసుకున్నారు. నాలోని దర్శక ప్రతిభను గుర్తించి, నన్ను దర్శకుడిగా ఈ రంగంలోకి లాగింది అక్కినేని, ఆదుర్తి సుబ్బారావు అంటూ వ్యాఖ్యానించారు. సృజనశీలికి ఎప్పటికీ తృప్తి ఉండదని, ఎటువంటి కళాఖండాలు తీసినా ఇంతవరకు నాకు పూర్తి తృప్తి కలగలేదని ఆయన అన్నారు. ఎన్ని సినిమాలు తీసినా సరిపోనంత కథావస్తువులు మన కళా రూపాల్లో ఉన్నాయని ఆయన ప్రతిస్పందించారు. నేను తీసిన అన్ని సినిమాల్లోనూ నన్ను మానసికంగా ఎక్కువ వేధించిన చిత్రం ‘సిరివెన్నెల’ అని గుర్తు చేసుకున్నారు.  నేను చూపించిన పాత్రలకంటే నా దర్శకపాత్రే నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుందని విశ్వనాథ్ అంటున్నారు.

“సినిమా” అంటే ? ఇది అని ఎవరూ నిర్వచించలేరని ఆయన చెబుతున్నారు. నేటి యువదర్శకులు ఎంతో తెలివైన వారని, ఈ తరంతో కూడా జర్నీ చేయడం తనకెంతో ఆనందంగా ఉందని, వారందరూ నాకిష్టమేనని వ్యాఖ్యానించారు. ఎవరైనా నిర్మాతలు ముందుకొచ్చి సినిమా తీస్తానంటే తాను సిద్ధంగా ఉన్నానని కళా తపస్వి బదులిచ్చారు.

“ద్రౌపదికి అయిదుగురే భర్తలు. కానీ దర్శకుడికి 50 మంది భర్తలు ఉంటారని“ ఆయన ఛలోక్తి విసిరారు. అవార్డులకు మించిన ఐశ్వర్యం లేదని, అవి దివ్య ఔషధాల్లా పనిచేస్తాయని కె. విశ్వనాథ్‌ ప్రతిస్పందించారు.

శంకరాభరణం సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని, కె. విశ్వనాథ్ ప్రతిభను ఖండాతరాలకు తీసుకెళ్లిన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు పుట్టిన రోజు నాడే, ఆ చిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్ కు దాదా సాహెబ్ అవార్డు ప్రకటించడం విశేషం.ఈ సందర్భంగా  కళాతపస్వి నివాసం మీడియా సభ్యులతో కిటకిటలాడింది.

ఈ అవార్డు ప్రదానం రాష్ట్రపతి చేతుల మీదుగా మే 3వ తేదీన ఢిల్లీ విజ్ఞాన భవన్ లో జరగనుంది. ఈ అవార్డు కింద 10 లక్షల రూపాయల నగదు, స్వర్ణకమలం, శాలువ బహూకరిస్తారు. కె, విశ్వనాథ్ తన సుదీర్ఘ సినీప్రస్థానంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు, సత్కారాలు పొందారు. ఇప్పటికే 1992లో పద్మశ్రీ,  జాతీయ పురస్కారాలు – 5,   నంది అవార్డులు – 20, లైఫ్ టైం అచీవ్ మెంట్ తో పాటు 10 సార్లు  ఫిలింఫేర్ అవార్డులు అందుకొని భారతీయ సినీ శిఖరంగా కళాతపస్వి ప్రపంచఖ్యాతి పొందారు.

– మా శర్మ

Have something to add? Share it in the comments

Your email address will not be published.