తప్పని బ్యాగుల మోత

Save my Back campaign continues to save the children from books Load

Save my Back campaign continues to save the children from books Load

చిట్టిపొట్టి నడకలతో స్కూళ్ళకు హాయిగా నడుస్తూ వెళ్ళే చిన్నారులు ఈరోజుల్లో ఎంతమంది ఉంటారు??? అలాంటి పిల్లల్ని మీరు చూడాలనుకుంటే మాత్రం మీది అత్యాశే అవుతుంది. ఎందుకంటే బండెడు పుస్తకాలతో తమ బరువుకంటే పుస్తకాల బ్యాగు బరువు ఎక్కువగా ఉండి కాళ్లీడుచుకుంటూ స్కూళ్ళకి వెళ్ళే చిన్నారులే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలు. మరికొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్ళు పునః ప్రారంభమౌతున్న నేపథ్యంలో చిన్నారుల పుస్తకాల బరువుపై ప్రత్యేక కథనం.

కేంద్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతను తీసుకొచ్చిన నిర్బంధ విద్యాహక్కు చట్టం అమలు దేశవ్యాప్తంగా జరుగుతోంది. విద్యాహక్కుచట్టం ముఖ్యఉద్దేశ్యం కూడా దేశంలోని 5 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలోపు పిల్లలందరినీ తప్పనిసరిగా బడిబాట నడిపించాలనే. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ విద్య మిథ్యగా మారిన ఈ రోజుల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు వేలనుంచి లక్షలకొద్దీ ఫీజులు వసూలుచేస్తూ విద్యార్థుల పుస్తకాల బరువును యేటేటా పెంచుతూ పోతున్నాయి.

ఎన్ని పుస్తకాలు బ్యాగులో ఉంటే అంత చదువు అందిస్తున్నామన్న భరోసా కల్పిస్తూ విద్యా సంస్థలు తమ ఉనికిని కాపాడుకునేందుకు విద్యార్థుల భవిష్యత్తును ఏ మాత్రం ఆలోచించకుండా బరువు మోత మోగిస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాలు,నగరాలకే పరిమితమైన ఇంగ్లీష్‌మీడియం స్కూళ్ళు ఇప్పుడు దాదాపు ప్రతీ పల్లెటూరుకి చేరుకుంది. మరోవైపు ఒకప్పుడు పెద్దపెద్ద నగరాల్లో ఉండే కార్పోరేట్‌ స్కూళ్ళు నేడు పట్టణాల విస్తరించడం జరిగింది. రాష్ట్రంలోని ప్రైవేట్‌, కార్పోరేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు విద్యార్ధులకు పుస్తకాలు అందించడంలో పోటీపడుతున్నాయి.

ఉదాహరణకు సర్కార్ పాఠశాలల్లో ఒకటవ తరగతి విద్యార్థికి పలక, నోట్ పుస్తకం, తెలుగువాచకంతో సహా అన్ని పుస్తకాలు కలిసి ఐదుకు మించవు. దీని బరువు సరాసరి కిలో కూడా దాటదు. అయితే అదే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల విషయానికి వస్తే దాదాపు చిన్న స్కూల్ అయితే ఐదు కిలోల బరువు, పెద్ద స్కూల్ అయితే ఏడు కిలోల వరకు ఉంటుంది.

అయితే ఒకటవ తరగతిలో చేరాలంటే కనీసం ఆ పిల్లవాడి వయస్సు ఐదు సంవత్సరాలు ఉంటుంది. అయితే విద్యార్థి బరువు విషయానికొస్తే దాదాపు 15 నుంచి 20 కిలోల బరువున్న విద్యార్థిపై పుస్తకాల మోత అందులో సగం కావడం గమనించాల్సిన విషయం. ప్రతి నిత్యం స్కూల్‌కు వెళ్ళే విద్యార్థులు ఈ పుస్తకాల బరువును మోయలేక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. స్కూల్‌కు దూరంగా ఉన్న విద్యార్థులు ప్రతి నిత్యం ఈ బ్యాగుల బరువు మోస్తుండడం వల్ల అనేక ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.

విద్యార్థుల తల్లితండ్రులు మాత్రం తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బరువు ఎంతైనా ఏ మాత్రం దాని గురించి పట్టించుకోవడంలేదు. దీంతో కార్పొరేట్ విద్యా సంస్థల్లో రోజురోజుకు పోటీ పెరిగిపోవడంతో విద్యార్థులపై చదువులను బలవంతంగా రుద్దేందుకు కొత్తకొత్త కోర్సుల పేరుతో పుస్తకాల సంఖ్య పెంచుతున్నారే తప్ప, తగ్గించడంలేదు. అంతేగాక ప్రైవేట్‌, కార్పోరేట్‌ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలతోపాటు సంబంధిత పాఠశాల స్పెషల్‌ బుక్స్‌ని కూడా విద్యార్థులకు తప్పనిసరి చేస్తోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కార్పోరేట్‌ పాఠశాలల్లో ఫీజులు ఎక్కువగా ఉండడంతోపాటు విద్యార్థులకు పుస్తకాల బరువు చాలాఎక్కువగానే ఉంటోంది.

చిన్నప్పటినుంచి విద్యార్థుల్లో మానసిక వికాసంలేక విద్యార్థులు పుస్తకాలపురుగులుగా తయారుకావడాన్ని విద్యావేత్తలతోపాటు అధ్యాపకులు తప్పుబడుతున్నారు. అంతేగాక పాఠశాలలు ప్రారంభమయిన రోజునుంచి విద్యార్ధులకు పుస్తకాల మోత ఎంతో బరువుగా ఉంటుంది. ఇటీవల కాలంలో కార్పోరేట్‌, టెక్నో స్కూల్స్ ప్రాముఖ్యతలోకి రావడంతో పిల్లల బరువు కన్నా పుస్తకాల బరువు ఎక్కువవుతోంది. సర్కార్ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల్లోనే పుస్తకాల బరువు రోజు రోజుకు పెరుగుతోందని, ఇది మంచి పరిణామం కాదని విద్యావేత్తలు సైతం చాలా ఏళ్ళనుండి చెబుతూనే ఉన్నారు.

అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం చదువుకున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ విద్యా సంస్థలు చెప్పినట్లు చేస్తూ సర్దుకుపోతున్నారే తప్ప, బరువు మోతపై ఏ నాడు ఎవరు కూడా ఆలోచించడం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ప్రారంభం కావడంతో ఈ పోటీ మరింత తీవ్రతరం అవుతోందని విద్యావేత్తలు చెబుతున్నారు. అంతేగాక విద్యార్థుల్లో మానసిక నైపుణ్యం పెరగాలంటే మాత్రం పుస్తకాల బరువుతో ఏమాత్రం సంబంధం ఉండదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

పుస్తకాలబరువు చిన్నారులపై ఎంతో మానసిక ప్రభావాన్ని చూపిస్తుందని విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. లేతవయసులోని చిన్నారులతో నోటుబుక్స్‌, వర్క్‌బుక్స్‌ అని ప్రైవేట్‌ పాఠశాలలు ఇబ్బడిముబ్బడిగా విద్యార్థులతో పుస్తకాలను మోయిస్తున్నాయని  అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఒకేరోజులో అన్ని చదువులు విద్యార్థులకు నేర్పించడం కుదరదని, ఈ విషయాన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు ఈ విద్యా సంవత్సరం నుండైనా పుస్తకాల బరువును తగ్గించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటేనైనా పరిస్థితి మారుతుందని అంటున్నారు.

చిన్నారులకు పుస్తకాలమోత పెరుగుతుండడం చిన్న వయసులోనే వయసుకు మించిన భారాన్ని మోయాల్సి రావడంతో విద్యార్థులు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొవడమేగాకుండా మానసిక ఒత్తిడి, చదువుపై ఆసక్తి క్రమేపి తగ్గుతుందని వైద్య నిపుణులు సైతం పేర్కొంటున్నారు. భావిభారతపౌరులను తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు పుస్తకాలమోతను పెంచి విద్యార్థుల ఆరోగ్యాలతోపాటు, జీవితాలతో చెలగాటమాడుకుంటున్నాయి. వేసవిసెలవుల్లో హాయిగా కేరింతలు కొట్టిన చిన్నారులు మరికొద్దిరోజుల్లో తమ పుస్తకాలబ్యాగును వీపుకు తగిలించుకొని వెళ్ళడానికి సిద్ధమౌతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.