దోచుకోవడానికి రెడీ

School Fees doubled as the managements decided to increase the fees and brining tears to Parents

School Fees doubled as the managements decided to increase the fees and brining tears to Parents

 

ప్రైవేట్‌ స్కూళ్ళలో ఫీజుల మోత మోగనుంది. వచ్చే నెలలో ప్రారంభమౌతున్న విద్యాసంవత్సరం నుండి తల్లిదండ్రులకు విద్యాభారం మరింత పెరుగనుంది. విద్యాహక్కుచట్టంలో భాగంగా పేదవిద్యార్థులకు 25శాతం సీట్ల కేటాయింపు అమలు సంగతి ఏమోకానీ …. రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణా లోపంతో ప్రైవేట్‌ స్కూల్స్‌‌లో చదివే విద్యార్థులకు ఫీజుల షాక్‌ తాకనుంది. నగరాల్లో పెరుగుతున్న ఖర్చులతో ఫీజుల పెంపు తప్పనిసరి అంటున్నాయి ప్రైవేట్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్స్. వచ్చే విద్యాసంవత్సరానికి ఇప్పటికే అడ్మిషన్లు మొదలుపెట్టిన స్కూల్స్‌… పెంచిన ఫీజులతో పేరెంట్స్‌కు షాక్‌ ఇస్తున్నాయి. మామూలు ప్రైవేట్‌ స్కూల్స్ లో పెరిగిన ఫీజులు, ఐఐటిఫౌండేషన్, ట్రాన్స్ పోర్టు ఫీజులభారం ఒకవైపైతే, హైదరాబాద్‌వంటి నగరాల్లో కుప్పలుగా పుట్టకొస్తున్న ఇంటర్నేషనల్‌ స్కూల్స్ … ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ అంటూ ఫీజుల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేస్తూ తల్లిదండ్రులకు పగలే చుక్కలు చూపిస్తున్నాయి.

ఫీజుల షాక్‌ ఈయేడాది తల్లిదండ్రులకు గట్టిగానే తాకేటట్లుంది. టెక్నో స్కూల్, కాన్సెప్ట్ స్కూల్‌, ఐఐటిఫౌండేషన్‌ స్కూల్‌, ఇంటర్నేషనల్‌ స్కూల్‌ పేర్లకు తోకలు లేకపోయినా పేరేదైనా ఫీజులు, డొనేషన్ల పేరుతో తల్లిదండ్రుల వీపు విమానంమోత మోగిస్తున్నాయి మేనేజ్‌మెంట్స్‌. నింగికెగసిన నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజలు సతమతమవుతుంటే, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ఫీజుల వాతలతో సగటు జీవి అల్లాడుతున్నాడు. పిడుగులా వచ్చి మీద పడినట్టు, ఇష్టారాజ్యంగా ఫీజుల పెంపుతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత లేక దీన స్థితి ఒకవైపు, జీతాల్లో కోత మరోవైపు, నిత్యావసరాల ధరల పెరుగుదల ఇంకోవైపు, స్కూల్‌ ఫీజులు ఎడాపెడా పెంచడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు.

ఆదాయం తగ్గడం, కొనుగోలు శక్తి మరింత దిగజారడంతో తల్లిదండ్రులు మానసికంగా కుంగిపోతున్నారు. తమ పిల్లలను చదివించాలనే పట్టుదల, ఫీజులను కట్టుకోలేక మాన్పించాలన్న ఉద్రేకంలో మానసికంగా కొట్టుమిట్టాడుతున్నారు. ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలు ఈయేడాది కంటే వచ్చే యేడాదికి సంబంధించిన షీజులను 20 నుంచి 200 శాతం ఫీజులు పెంచడంతో తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. సేవాదృక్ఫధంతో విద్యాలయాలను ప్రారంభించామని చెబుతున్న స్కూల్‌ మేనేజ్‌మెంట్స్ ప్రస్తుతం విద్యావ్యాపారాన్ని సజావుగా చేసుకుంటున్నాయి. ఫీజులు పెంచిన నేపథ్యంలో పాఠశాలల్లో మౌళికవసతుల కల్పనలో పాఠశాలల యాజమాన్యాలు విఫలమౌతున్నాయని తల్లిదండ్రలు వాపోతున్నారు.

ప్రైవేటు పాఠశాలలు తమ ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచడంతో తల్లిదండ్రులకు మోయలేని భారం ఏర్పడింది. కొన్ని పాఠశాలలు రెట్టింపు స్థాయిలో ఫీజులు పెంచాయి. ఒక పద్ధతి ప్రకారం కాకుండా రాష్ట్రంలోని ప్రయివేటు పాఠశాలలు కొన్ని అడ్డగోలుగా ఫీజులను పెంచుతూ తల్లిదండ్రులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఫీజుల పెంపునకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఫీజులు ఇంత భారీగా పెంచడంతో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు తల్లిదండ్రులు. ప్రైవేటు యాజమాన్యాలు బహిరంగంగా ఫీజుల దోపిడీ చేస్తున్నాయి. తల్లిదండ్రులపై ఇంత భారం పడినా ప్రభుత్వం మాత్రం కనీస చర్యలు తీసుకోవడంలో విఫలమైంది.

పాఠశాలలపై అజమాయిషీ, నియంత్రణ ఉండాల్సిన విద్యాశాఖ ఎందుకూ కొరకావడం లేదు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రయివేటు యాజమాన్యాలకు రెక్కలు వచ్చినట్లయింది. ఫీజుల పెంపునకు అడ్డూఅదుపూ లేకపోవడంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిందంటున్నారు తల్లిదండ్రులు. మరోవైపు ప్రభుత్వపరంగా ఉండాల్సిన పర్యవేక్షణలేకపోవడంతో ప్రైవేట్‌ యాజమాన్యాలు ఆడిందే ఆటగా సాగుతోందంటున్నారు తల్లిదండ్రులు. మరోవైపు ప్రతీయేడాది ప్రభుత్వం ప్రైవేట్‌ స్కూల్‌ ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టినా యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోవట్లేదు. ప్రయివేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజుల దోపిడీకి కళ్లెం వేయడం సాధ్యమేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు విద్యాహక్కుచట్టం అమలులో భాగంగా ప్రైవేట్‌ పాఠశాలల్లోని 25శాతం సీట్లు ఆయా ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి చాలా ఏళ్ళు గడిచిపోయాయి. అయితే పేదవిద్యార్థులకు 25శాతం సీట్ల కేటాయింపుని ప్రైవేట్‌, కార్పోరేట్‌, ఇంటర్నేషనల్‌ స్కూల్స్ పట్టించుకుంటాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రైవేటు స్కూల్స్ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల భవిష‌్యత్తు బాగుండాలంటే నాణ్యమైన విద్యే కీలకమని భావిస్తున్నారు. ముఖ్యంగా ఫీజులు ఏ స్కూల్‌ ఎక్కువగా వసూలుచేస్తే ఆ స్కూల్‌ మాత్రమే నాణ్యమైన విద్య అందిస్తుందని భావించే తల్లిదండ్రులు ఉన్నంతకాలం ప్రైవేట్‌ పాఠశాలల ఆగడాలు ఆగే ప్రసక్తేలేదు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.