ఓటుకు నోటులో చంద్రబాబుకు నోటీసులు

ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామక‌ృష్ణారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విచారణ జరగాలన్న డిమాండ్‌తో చాలాకాలంగా పోరాటం చేస్తున్నారు.  గతంలో ఓటుకు నోటు వ్యవహారంలో హైకోర్టు స్టే విధించడంతో హైకోర్టు స్టేను సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. దీంతో ఓటుకు నోటు వ్యవహారంపై విచారణను  చేపట్టిన ఈ అంశం కూడా అవినీతి నిరోధక చట్టం కిందకే వస్తోందని తెలిపింది. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు  హైకోర్టు స్టేను పక్కనబెడుతూ చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది. అంతేగాక వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులపై చంద్రబాబు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఘాటుగా స్పదించారు. కోర్టుల నుంచి నోటీసులు రావడం సహజమేనని, ఇందులో కొత్తేమీలేదని, ఇప్పటికే చాలా సార్లు నోటీసులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. అసలు ఓటుకు నోటు కేసులో ఏమీ లేదని అన్నారు చంద్రబాబు.

రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా దుమారం రేపి సంచలనం సృష్టించిన ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుకి నోటీసులు వచ్చేలా చూడాలని మొదట్లో తెలంగాణా ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేసి మధ్యలో కొన్ని రాయబారాల వల్ల నెమ్మదించింది. దీంతో ఇక చంద్రబాబు జోలికి ఎవరూరారనే నమ్మకం అందరికీ గట్టిగా ఏర్పడింది.  ఇప్పటివరకూ తనపై ఒక్క ఆరోపణ కూడా రుజువు కాలేదని.. పాతికపైగా ఫిర్యాదులు చేసినా.. ఎవరూ ఏ మాత్రం రుజువు చేయలేకపోయారని చంద్రబాబు బ్యాచ్ ఢంకా భజాయించి చెబుతూ వస్తుండడంతో అందరూ ఓటుకు నోటు కేసు నీరుగారిపోయింది అనుకున్నారు. అంతేగాక అవినీతి, అక్రమాస్తుల వంటి విషయాలు వచ్చినప్పుడు తాను నిప్పులాంటి మనిషినని చెప్పుకొనే చంద్రబాబుకి ఓటుకు నోటు కేసు మళ్ళీ చుట్టుకుంటోంది.

అయితే ఓటుకు నోటు కేసు దాదాపు మూలకుపడిపోయింది, తెలంగాణా ప్రభుత్వం ఎలాంటి చొరవలేకపోవడంతో అంతా సద్దుమణిగిందనుకొనే సమయంలో చంద్రబాబు ఇమేజ్‌కు డ్యామేజ్ అయ్యేలా ప్రతిపక్షానికి సుప్రీం నోటీసుల రూపంలో ఓ అస్త్రం లభించినట్లైంది. ఓటుకు నోటు వ్యవహారం ద్వారా చంద్రబాబును ఇరుకునపెట్టాలని ప్రతిపక్షపార్టీ భావించి పనులు ముమ్మరం చేసింది. మొత్తానికి తెలంగాణా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కి ఐదు కోట్ల రూపాయలు ఇస్తూ అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి ఆడియో ఫైలులో ఉన్న మనవాళ్ళు బ్రీఫ్‌డ్ మి అనే అంశం ఎక్కడివరకు వెళ్తుందో వేచిచూడాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.