అసలైన ఆట మొదలైంది

Shilpa Mohan Reddy joins YSRCP for Nandyal by poll opposing TDP agenda

నంద్యాల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వైసీపీ నుండి టిడిపిలోకి మారిన తర్వాత జరిగిన పరిణామాల కంటే ఆయన చనిపోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాలనే తమవైపు తిప్పుకొనేలా చేస్తున్నాయి.

Shilpa Mohan Reddy joins YSRCP for Nandyal by poll opposing TDP agenda

వైసీపీ గుర్తుతో గెలిచి టిడిపిలోకి వెళ్ళినందుకు నంద్యాల స్థానం తమదేనని, ఖచ్చితంగా అభ్యర్థిని నిలబెడతామని వైసీపీ ఒకవైపు చెబుతుంటే, మరోవైపు చనిపోయిన వ్యక్తికి గౌరవసూచకంగా తమ కుటుంబ సభ్యులనే ఎన్నుకోవాలని భూమా కుటుంబం కోరుతుండడం, ఈ మధ్యలో శిల్పా మెహన్ రెడ్డి నంధ్యాల టికెట్ తనకే చెందాలని గట్టిగా పట్టుబడటం, వీటన్నింటి మధ్య టిడిపినుండి సీటు ఎవరికి ఇస్తారన్నదానిపై చాలారోజులుగా స్పష్టత రాకపోవడం, అటు తరువాత టీడీపీ మాజీమంత్రి శిల్పా మోహన్‌రెడ్డిని పిలిపించుకొని మాట్లాడినా చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వకపోవడం, చివరికి చేసేదేమీలేక కార్యకర్తల కోరిక రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని శిల్పా జగన్‌తో మాట్లాడి వైసీపీలో చేరేలా సెటిల్మెంట్ చేసుకోవడంవంటి అనేక పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటి చకచకా జరిగిపోయాయి.

దీంతో నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు ఇక దాదాపుగా రెడీ అయినట్లుగానే అనిపిస్తోంది. మాజీమంత్రి శిల్పామోహన్‌రెడ్డి వైసీపీలో చేరతున్నానని ప్రకటించడంతో వైకాపా తరపున నంద్యాలలో నిలబడే అభ్యర్థిపై క్లారిటీ వచ్చేసింది. దీంతో భూమా కుటుంబం తరుపున తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారు అయినట్టేనని టాక్ వినిపిస్తోంది.

మరోవైపు వైయస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు శిల్పామోహన్‌రెడ్డి. ఎన్నోరోజుల నుండి చంద్రబాబు నిర్ణయంకోసం ఎదురుచూసి చూసి విసిగిపోయిన శిల్పామోహన్‌రెడ్డి.. చంద్రబాబుని నమ్మలేక పార్టీని మారిపోతున్నట్లు ప్రకటించారు. ఎన్నో ఏళ్ళుగా పార్టీ అధికారంలో లేకున్నా ఎన్నో సేవలు చేసినప్పటికీ ఏ రోజు పార్టీ పట్టించుకోలేదని, అడుగడుగునా అవమానపరిచారని శిల్పా బాధపడుతున్నారు.

తెలుగుదేశం పార్టీ విధానాలతో విసిగిపోయిన శిల్పా కార్యకర్తలతో సమావేశమై.. పార్టీలో తీవ్ర అవమానాలు జరుగుతున్నాయని, ఇవి భరించి ఇలాగే కొనసాగుదామా లేక పార్టీ మారిపోదామా అని కార్యకర్తలను అడిగేందుకు సమావేశం పెడితే అందరూ పార్టీ మారేందుకు సంకేతాలు ఇచ్చారు. దీంతో జగన్మోహన్‌రెడ్డి పంచన చేరుతున్నారు శిల్పా.

మరోవైపు నంద్యాల ఉప ఎన్నిక సాక్షిగా వైఎస్‌జగన్మోహన్‌రెడ్డికి గట్టిదెబ్బ కొడదామనుకున్న టిడిపి, అభ్యర్థి ఎంపిక విషయంలో అనవసరంగా చేసిన తాత్సారానికి మూల్యం చెల్లించుకుంటోంది. నంద్యాల ప్రాంతంలో భూమా కుటుంబానికి ఎంతైతే అజమాయిషీ ఉందో శిల్పా కుటుంబానికి కూడా అంతే అజమాయిషీ ఉంది. శిల్పా మోహన్‌రెడ్డిని జగన్‌ తనవైపుకి తిప్పుకోవడంతో సెల్ఫ్‌ డిఫెన్స్‌లో పడ్డ అధికారపార్టీ నాయకులకు ఇప్పుడు ఖచ్చితంగా నంద్యాల సీటు గెలుచుకోవడానికి ఒళ్ళు వొంచాల్సిన పరిస్థితి ఎదురైంది.

దీంతో స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు నాయుడే ఉపఎన్నిక రంగంలోకి దిగుతున్నారనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. పార్టీ వీడుతూ సీనియ‌ర్‌నేత శిల్పా మోహ‌న్‌రెడ్డి బాబుకు ఝల‌క్ ఇచ్చారని అందుకే మంత్రులు భూమా అఖిల‌ప్రియ‌, కాల్వ‌ శ్రీనివాసులు, అచ్చెన్నాయ‌డుల‌తో చంద్రబాబు చ‌ర్చ‌లు జ‌రిపారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి గత కొన్ని రోజులుగా నంద్యాల వేదికగా జరుగుతున్న రాజకీయ అలజడి రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ఎవరు ఉపఎన్నికల్లో పైచేయి సాధిస్తారన్నది తేలాల్సి ఉంది.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.