అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

Sri Seetaramula Kalyanam celebrated in grand way at Bhadrachalam

Sri Seetaramula Kalyanam celebrated in grand way at Bhadrachalam

భద్రాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కమనీయంగా సాగిన స్వామి వారి పెళ్లి వేడుకను చూసి భక్తులు పులకించిపోయారు. వేకువజామునుండే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కల్యాణ మండపం కిటకిటలాడింది. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామి వారి కల్యాణాన్ని కన్నులారా వీక్షించి దర్శించారు. కల్యాణ వేడుక కోసం భద్రాచలం సుందరంగా ముస్తాబైంది. శ్రీ సీతారాముల కల్యాణ ఘట్టం ఎంతో వైభవంగా ప్రారంభమైంది. కల్యాణ మంటపం పైకి స్వామి వారు చేరుకున్న అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణ వేడుక ప్రారంభమైంది.

శ్రీ యముద్వాహ్యస్యే అన్న సంకల్పంతో స్వామికి ఎదురుగా సీతమ్మను కూర్చుండబెట్టి కన్యావరణను జరిపించారు. మోక్ష బంధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీతధారణం చేశారు. వధూవరుల వంశ గోత్రాల ప్రవరలు ప్రవచించారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళణం, పుష్పోదక స్నానం నిర్వహించి వరపూజ చేశారు. భక్త రామదాసు చేయించిన బంగారు ఆభరణాలను స్వామివారికి, అమ్మవారికి అలంకరించారు. మధుపర్కప్రాశన అనంతరం తేనె, పెరుగు కలిపిన మిశ్రమాన్ని స్వామికి నివేదించి, సీతారాములకు నూతన వస్త్రాలంకరణ చేశారు. లోకమంతా సుఖసంతోషాలతో ఉండాలని మహాసంకల్పం పఠించారు. అనంతరం కన్యాదానంతోపాటు గోదానం, భూదానం చేయించారు. సరిగ్గా 12.18 నిమిషాలకు అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లాన్ని ఉత్సవమూర్తుల శిరస్సులపై ఉంచారు. అనంతరం భక్తుల హర్షధ్వానాల మధ్య సీతమ్మకు మాంగల్యధారణ కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. కల్యాణఘట్టంలో అత్యంత ప్రసిద్ధి చెందిన తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అయోద్యరామయ్య కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.