శశికళతో అజిత్ కుమార్ భేటీ

tamil-film-actor-ajith-kumar-met-sasikala

చెన్నై: తమిళనాడు రాజకీయాలు కొత్తమలుపులు తిరుగడంలో హీరో అజిత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారని ఊహాగానాలు సాగుతున్నాయి.  జయకు నమ్మినబంటు ఓ.పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కారు. కానీ ఆయన్ని దింపేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది ఆ పార్టీ నేతలే బలంగా చెబుతున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా అజిత్ తెరమీదకు వచ్చారు.

తాజాగా హీరో అజిత్ సోమవారం రాత్రి 8 గంటల సమయంలో పోయెజ్ గార్డెన్‌కి వెళ్లి శశికళతో ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. ఈ సమావేశాన్ని అన్నాడీఎంకే వర్గాలు కూడా ధ్రువీకరించాయి. పార్టీ పగ్గాలను అందుకునే క్రమంలో అజిత్‌తో శశికళ భేటీ జరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. జయ మరణం తర్వాత పార్టీ పగ్గాలు అజిత్ స్వీకరించే అవకాశం వుందంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి.

అజిత్ ని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని  జయలలిత ఆలోచించినట్టు వార్తలు వచ్చాయి. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరకముందు అజిత్ ని రాజకీయ శక్తిగా రూపుదిద్దాలని సన్నిహితులతో చెప్పినట్టు చెప్పుకున్నారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో పార్టీలో అజిత్ పాత్ర మీద స్పష్టత వస్తోంది. రేపటి రోజున శశికళకు అండగా అతడు నిలబడవచ్చుననే ప్రచారం కూడా ఊపందుకుంది.

జయలలిత స్నేహితురాలు శశికళ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికి  అనేక ప్రతికూల పరిస్థితులు ఆమెను చుట్టుముట్టడంతో అజిత్ ని రంగంలోకి దించినట్టు తెలుస్తున్నది. పన్నీర్ సెల్వంను గద్దెదింపాలంటే ఆయన స్థానంలో అజిత్ ని తీసుకురావాలని ఆమె ఆలోచనగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో తమిళనాట అధికార పార్టీలో పెను మార్పులు సంభవించడం ఖాయమని అంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.