టార్గెట్ 2019: ప్రత్యర్థిని దెబ్బతీయడంలో ‘దొందూ… దొందే..!’

Target 2019 KCR and Naidu are known for their skills in dealing with rivals

Target 2019 KCR and Naidu are known for their skills in dealing with rivals

విభజించు, పాలించు అన్న సూత్రాన్ని ఆధారంగా చేసుకొని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిపాలన కొనసాగిస్తున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల ఉనికి లేకుండా చేయాలనే వ్యూహంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత, టీఆర్ఎస్ నేతృత్వంలో కె.చంద్రశేఖర్‌రావు, ఎపిలో తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు అధికారాన్ని దక్కించుకున్నారు. అప్పటినెుండి రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే రాజకీయ పావులు కదుపుతూనే ఉన్నారు.

2014 ఎన్నికల్లో తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో అభ్యర్ధులను నిలబెట్టగా 63 మంది గెలిచారు. అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కెసీఆర్ తన రాజకీయ ఎత్తుగడలను వేయడం మొదలుపెట్టారు. ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు తెలంగాణ సెంటిమెంటును తాయిలంగా చూపి, అసలు ప్రతిపక్షమేలేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో తమ పార్టీలోకి ఆహ్వానించడంతో ఇప్పుడు గులాబీదళబలం 90కి చేరింది. అసలు తెలంగాణా ప్రాంతంలో కాసింత బలంగా ఉన్నతెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో తమ హవా నడిపించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ టిడిపి నుండి గెలుపొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ డిసెంబర్ 2014 టిఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకొని ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. ఒక పక్క పార్టీ ఫిరాయించిన అభ్యర్ధులను అనర్హులుగా ప్రకటించాలని టిడిపి డిమాండ్ కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మౌనం వహించారు.

ఈ నేపధ్యంలో జూన్ 2015 లో తెలంగాణ శాసన మండలి ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చిన ఓటుకు నోటు కుంభకోణంలో చంద్రబాబు నాయుడి ప్రమేయం ఉందని టిఆర్ఎస్ ఆరోపించింది. మరోవైపు చంద్రబాబు కొత్త రాష్ట్రంలో కొత్త రాజధాని నిర్మాణంలో బిజీ బిజీగా ఉండడంతో ఇక్కడ పార్టీని పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు. ఈ పరిస్థితుల్లో పాలకుర్తి ఎమ్ఎల్ఏ ఎర్రబెల్లి దయాకర్‌రావుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పడింది. ఎర్రబెల్లి తన మద్దతుదారులతో టీఆర్ఎస్ తీర్ధం తీసుకున్నారు. తెలంగాణాలో మొత్తం 15 మంది టిడిపి శాసనసభ్యుల్లో 12 మంది సభ్యులు టిఆర్ఎస్ లో చేరారు. దీంతో తెలంగాణా తెలుగుదేశం పార్టీలో చీలిక ఏర్పడటంతో టిడిపీకి పెద్ద దెబ్బ తగిలింది. అదే విధంగా తెలంగాణ అసెంబ్లీలో 21 సభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీ, చివరకు 12 మంది సభ్యులకే పరిమితమయ్యారు. టిఆర్ఎస్ పన్నిన వ్యూహంలో 9 మంది ఫిరాయించారు. అంతేగాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన ముగ్గురు అభ్యర్ధులను కూడా టిఆర్ఎస్ తమ బుట్టలో వేసుకుంది.

అయితే ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్ మౌనం వహించడంపై టిడిపి, కాంగ్రెస్ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములవ్వాలనే సంకల్పంతో ఇతర పార్టీలకు చెందిన శాసనసభ్యులు తమ పార్టీలో చేరారని టీఆర్ఎస్ వాదిస్తోంది.

మరోవైపు కెసిఆర్‌బాటలోనే చంద్రబాబు కాస్త ఆలస్యంగా మేలుకున్నప్పటికీ తను కూడా ప్రతిపక్షాన్ని ఇరుకునపెట్టే విధంగా ఆపరేషన్ ఆకర్ష్‌ను వాడుకున్నారు. అందులోభాగంగాఎపిలో ప్రతిపక్ష పార్టీ వైసిపి ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకున్నారు. 2014 ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ 67 సీట్లు గెలిచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీగా గట్టి పోటీని ఇచ్చింది. కొత్త రాజధానితోపాటు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తానని చంద్రబాబు ఎన్నికల్లో చేసిన వాగ్దనాలను నెరవేర్చాలని వైఎస్ఆర్సీపి గట్టిగా పట్టుబడుతోంది. ఇకపోతే రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉండటంతో టిడిపి చాలా వెనుకబడి ఉంది. వైసీపీ అధినేత జగన్ ఎదుర్కొంటున్న కేసుల పరంపరను తెలుసుకున్న టిడిపి వైఎస్ఆర్ సీపి ఎమ్మెల్యేలపై కన్ను వేశారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంపైనే వారు దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 67 సభ్యులున్న వైఎస్ఆర్ సిపి సంఖ్యను ఆపరేషన్ ఆకర్ష్ మంత్రంతో 21 మంది సభ్యులను తమవైపు ఆకర్షించడానికి టిడిపి విజయం సాధించింది. అందులోనూ పార్టీ ఫిరాయించినవారిలో ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మంత్రులుగా చోటు లభించింది.

రాబోయే 2019 ఎన్నికలలో గెలుపొందడానికి తమదైన శైలిలో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు పావులు కదుపుతున్నారు. తమ ఆధిపత్యాన్ని ఏకీకృతం చేయడానికి కేసీఆర్, చంద్రబాబు నాయుడు వారి రాష్ట్రాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపద్యంలో పార్టీ ఫిరాయింపుల నిరోదక చట్టాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయకుండా, తుంగలో తొక్కి యధేచ్ఛగా ఫిరాయింపులకు పాల్పడుతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.