తెలుగు తమ్ముళ్ళ మధ్య చిచ్చురేపిన క్యాబినెట్ విస్తరణ

TDP MLAs are unhappy about Cabinet Expansion

TDP MLAs are unhappy about Cabinet Expansion

మంత్రివర్గ విస్తరణ తెలుగు తమ్ముళ్ళకు గట్టిషాక్ ఇవ్వడంతోపాటు చాలామందిని అసంతృప్తికి గురిచేసింది. క్యాబినెట్ విస్తరణలో భాగంగా తమకు అవకాశం వస్తుందనుకొని భంగపడ్డ తెలుగు తమ్ముళ్ళతోపాటు ఉన్న పదవులు ఊడి మరికొంతమంది గరం గరంగరంగా ఉన్నారు. కొన్ని జిల్లాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులివ్వడంతో వారి ప్రత్యర్థులు నేరుగా ముఖ్యమంత్రినే నిలదీశారు.

ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేసినా పట్టించుకోలేదని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసంతృప్తులు, అలకవహించిన వారిని బుజ్జగించేందుకు, తాయిలాలిచ్చి లాలించేందుకు ఎప్పటిమాదిరిగానే చంద్రబాబు సీనియర్లను రంగంలోకి దించారు. పలువురితో స్వయంగా మాట్లాడారు. అసంతృప్త నేతల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, బొండా ఉమా, చింతమనేని ప్రభాకర్‌, ధూళిపాళ్ల నరేంద్ర, అనితలు ఉన్నారు.

మంత్రివర్గ విస్తరణకు గంటముందే టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అనంతరం పరిస్థితిని తాను అర్థం చేసుకున్నట్లు బొజ్జల ప్రకటించారు. అతనేకాకుండా విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మంత్రి పదవి రాకపోవడంతో అలకబూనిన ఆయనకు మద్దతుగా స్థానిక కార్పొరేటర్లు కూడా రాజీనామా చేస్తామని ప్రకటించారు. దీంతో ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణలు ఆయన్ను బుజ్జగించి సీఎం వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్ఛాప్ చేసి అజ్నాతంలోకి వెళ్ళారు.

గుంటూరు జిల్లా సీనియర్‌ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కూడా మంత్రి వర్గంలో చోటు దక్కకపోవటంపై అసంతృప్తితో ఉన్నారు. తమ నేతకు మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంపై తీవ్ర అసంతృప్తితోఉన్న కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో మహిళానేత.. ఎమ్మెల్యే అనిత నిరాశకు గురయ్యారు. వీళ్ళేకాకుండా కాంగ్రెస్‌నుండి టీడీపీలోకి వచ్చిన పితాని సత్యనారాయణకు మంత్రిపదవి కేటాయించడంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సీరియస్‌గా తీసుకున్నారు.

మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించిన పయ్యావుల కేశవ్‌ తనకు మద్దతుగా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని చంద్రబాబుకు వద్దకు పంపినా సీఎం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి వచ్చిన భూమా అఖిలప్రియకు మంత్రివర్గంలో స్థానం కల్పించడంపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డితో పాటు బనగానపల్లె, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్‌ రెడ్డి, జయనాగేశ్వరరెడ్డిలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

బ్లాక్ డే అన్న జగన్ :

ఏపీ మంత్రివర్గ విస్తరణ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో ఈరోజు బ్లాక్‌డే అని జగన్‌ అన్నారు. పార్టీ ఫిరాయించిన వారిని కేబినెట్‌లోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన విమర్శించారు. అంతేగాక మంత్రివర్గ విస్తరణలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌పై ప్రతిపక్షనేత జగన్‌ విమర్శలు చేశారు. స్పీకర్‌ అండదండలతో సీఎం రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.