భూ బకాసురుడు అరెస్ట్

TDP MLC Deepak reddy is being arrested by CCS police in Land Grabbing case

TDP MLC Deepak reddy is being arrested by CCS police in Land Grabbing case

అనంతపురం జిల్లా తెదేపా నాయకుడు, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని ఆయనకు సహకరించిన న్యాయవాది శైలేంద్ర సక్సేనాను భూఅక్రమాల కేసులో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.  బంజారాహిల్స్‌, ఆసిఫ్‌నగర్‌లో న్యాయవాది శైలేష్‌ సక్సేనా సాయంతో 165కోట్ల రూపాయల విలువైన భూఅక్రమాలకు పాల్పడ్డారని దీపక్‌రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆధారాలు లభించడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.  అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన దీపక్‌రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయానా అల్లుడు కావడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.

హైదరాబాద్‌లో కొన్నేళ్ళ క్రితం నివాసమున్న అయూబ్‌ కమల్‌ అనే శరణార్థికి చెందిన 3.37 ఎకరాల భూమి బంజారాహిల్స్‌లో ఉండగా.. 1960లో ఎంవీఎస్‌ చౌదరి అండ్‌ బ్రదర్స్‌ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి బంజారాహిల్స్‌లోని ఈ భూమి వారి ఆధీనంలోనే ఉంది. అయితే న్యాయవాది శైలేష్‌ సక్సేనా 2008లో అక్బర్‌ మొహినుద్దీన్‌ అన్సారీ, ఖజా మొహినుద్దీన్‌ అన్సారీ అనే ఇద్దరు వ్యక్తులు ఆ భూమికి యజమానులుగా తప్పుడు పత్రాలు సృష్టించాడు. అంతేగాక వాళ్ళిద్దరి దగ్గరి నుండి దీపక్‌రెడ్డి, సక్సేనా ఆ స్థలాన్ని కొనుక్కున్నట్లు దొంగపత్రాలు తయారు చేశారు.  అంతేగాక తమ 3.37ఎకరాల భూమిని చౌదరి అండ్‌ బ్రదర్స్‌ కబ్జా చేశారంటూ శైలేష్‌ సక్సేనా.. భూకబ్జా నిరోధక కోర్టులో ఫిర్యాదు చేశాడు.

ఈ కేసు విచారణలో ఉండగానే కొన్ని నెలల క్రితం చౌదరి తరఫు ప్రతినిధి రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన అసలు పత్రాలను కోర్టులో సమర్పించారు. దీంతో బంజారాహిల్స్‌ పోలీస్’స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా… పోలీసులు ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. మరోవైపు బంజారాహిల్స్‌ భూమితోపాటు ఆసిఫ్‌నగర్‌లో మొత్తం 165 కోట్ల రూపాయల భూములను అక్రమంగా సొంతం చేసుకునేందుకు శైలేష్‌ సక్సేనా పథకం వేయగా.. దీపక్‌రెడ్డి ఆర్థిక సహకారాన్ని అందించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

గతంలో సీసీఎస్‌లో ఈ గ్యాంగ్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. రెండింట్లో సక్సేనా బెయిల్ పొందగా, దీపక్‌రెడ్డిపై తనపై ఉన్న రెండు కేసులలో ఒకదానిలో బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ వచ్చిన సక్సేనా, దీపక్‌రెడ్డి, వీరికి సహకరించిన శ్రీనివాస్ విచారణ నిమిత్తం రెండ్రోజులుగా సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరవుతున్నారు. ఏసీపీ విజయ్‌కుమార్ నేతృత్వంలోని బృందం ముందుగా ఒక్కొక్కరిని విడిగా విచారించి, తరువాత ముగ్గురినీ కలిపి విచారించింది. విచారణకు సహకరించకపోవడంతోపాటు, ముగ్గురూ ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించడంతో మంగళవారం రాత్రి వీరిని అరెస్ట్ చేశారు.

దీపక్‌రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ఏపీ శాసనమండలి ఛైర్మన్‌కు అధికారిక సమాచారం ఇచ్చిన పోలీసులు, నకిలీ పత్రాలు సృష్టించడంలో వీరికి సహకరించిన ఆర్‌.శ్రీనివాస్‌ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసి చంచల్‌గుడ జైలుకి తరలించారు.

దీపక్‌రెడ్డికి సంబంధించి  హైదరాబాద్‌లో ఒకే చోట 78 ఎకరాల భూమి ఉందని, ఆ భూమి మార్కెట్ విలువ 943 కోట్లు ఉంటుదని పోలీసుల విచారణలో తేలింది. అంతేగాక దీపక్ రెడ్డి చేతిలో 3 వేల 128 ఎకరాలు ఉందని, 2012 లో ఉపఎన్నికలో రాయదుర్గం నుంచి పోటి చేసినప్పుడు నామినేషన్ వేసినప్పుడు, దీపక్ రెడ్డి చూపిన ఆస్తుల విలు 6,781 కోట్లు. వీటికితోడు జూబ్లీహిల్స్, బంజరాహిల్స్ లో వందలాది స్థలాలు ఉన్నాయని, దీపక్ రెడ్డి చేతిలో 15వేల కోట్లకు పైగా విలువైన స్థలాలు ఉన్నాయని అంచనాకొచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.