చర్చ లేకుండానే భూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం

Telangana Assembly passes bill on land acquisition with out any discussion in just 10 minutes

Telangana Assembly passes bill on land acquisition with out any discussion in just 10 minutes

భూ సేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదాన్ని తెలంగాణా అసెంబ్లీ కేవలం పది నిమిషాలలోనే చేసేసింది. విపక్షాల ఆందోళనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే చట్ట సవరణ బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

భూ సేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం కోసం ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ భూసేకరణ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. సభ ప్రారంభం కాగానే రాష్ట్రంలో రైతు సమస్యలపై చర్చకు కాంగ్రెస్‌ పార్టీ పట్టుబట్టింది. స్పీకర్‌ పోడియం వద్ద కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆమోదం తెలిపింది.

తర్వాత శాసనసభను స్పీకర్‌ నిరవధికంగా వాయిదా వేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అంతేగాక కీలకమైన బిల్లు విషయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడంపై వాయిదా అనంతరం కూడా కాంగ్రెస్‌ సభ్యులు సభలోనే ఉండి నిరసన కొనసాగించారు.

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి బీజేపీ నాయకులను అనుమతించకపోవడంతో వారు నిరసనకు దిగారు. రాష్ట్ర భూసేకరణ చట్ట సవరణ బిల్లు కోసం ఈ రోజు ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణా అసెంబ్లీలోకి అనుమతించకపోవడంపై గన్‌పార్క్‌ వద్ద ధర్నా చేసి అసెంబ్లీ వరకు నల్లకండువాలు, నోటికి నల్ల గుడ్డలతో పాదయాత్ర నిర్వహించారు.

కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ ‘గత శాసన సభ సమావేశాల్లో బీసీలకు అన్యాయం చేసే ముస్లిం మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే మమ్మల్సి సస్పెండ్‌ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రాకుండా అడ్డుకొని నియంతృత్వంగా వ్యవహరించారు. కేసీఆర్‌ పాలన ప్రజాస్వామ్య వ్యతిరేకంగా.. నిజాం నిరంకుశ రాచరిక పాలనను గుర్తు చేసేలా ఉంది. గత సభలో సస్పెండ్‌ అయితే ఈ సభకు రాకూడదని ఏ చట్టంలో ఉన్నదో సీఎం, స్పీకర్‌ చెప్పాలి.. స్పీకర్‌ ప్రేక్షక పాత్ర పోషించడం మంచిది కాదు. సీఎంను ఇంద్రుడు చంద్రుడు అని పొగిడే వారే సభలో ఉండాలి.. ప్రశ్నించే వారు ఉండకూడదనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. దీనికి టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తగిన మూల్యం చెల్లించుకుంటుందని మండిపడ్డారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.