కేసీఆర్‌పై ధ్వజమెత్తిన కమలనాథులు

telangana-bjp-leaders-fires-on-cm-kcr-comments-on-amitshah
telangana-bjp-leaders-fires-on-cm-kcr-comments-on-amitshah
గత మూడేళ్ళుగా స్థబ్దుగా ఉన్న తెలంగాణా రాజకీయాల్లో తన పర్యటనతో ఒక్కసారిగా హీట్ పెంచిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పై విరుచుకుపడ్డ కేసీఆర్‌పై కమలనాథులు గుర్రుగా ఉన్నారు. తెలంగాణా రాష్ట్ర పర్యటనలో అమిత్ షా చెప్పిన లెక్కలన్నీ అబద్ధాలనేనని కేసీఆర్ అనడాన్ని తప్పుబడుతున్నారు బిజెపి నేతలు. ముఖ్యమంత్రి కేసీఆరే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలంటూ ప్రజలను తప్పుబట్టిస్తున్నారని, కేంద్రం నుంచి ప్రతి పథకానికి వస్తున్న నిధులను, గ్రాంట్లను దారి మళ్లించి ప్రజల సొమ్మును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోచుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు.
సీఎం తనకు తానో తానీషాలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డ లక్ష్మణ్ ‘సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌’లో భాగంగా అన్ని వర్గాల ప్రజల్లో సమభావన పెంపొందించేందుకు అమిత్‌ షా సహపంక్తి భోజనం చేస్తే దాని మీద కూడా బురదజల్లాలని చూడటం చాలా దురదృష్టమని అన్నారు. ఎర్రటి ఎండలో ప్రజలను కలిసేందుకు అమిత్‌ షా వెళ్లారని.. సీఎం మాత్రం ప్రగతి భవన్‌లో ఏసీ వేసుకుని కూర్చున్నారని విమర్శించారు. అంతేగాక గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయకుండా కేసీఆర్‌ మహిళలను అవమానాల పాలు చేస్తున్నారని, అంతేగాక మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని కేసీఆరే వారందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. అంతేగాక మీ మీద మీకు అంత నమ్మకం ఉంటే పార్టీ ఫిరాయించిన 30 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మూడేళ్ల మీ పాలన సత్తా నిరుపించుకోండని కేసీఆర్‌కు సవాలు విసిరారు లక్ష్మణ్.
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌‌కు ముందుంది ముసళ్ల పండగేనని ఎద్దేవా చేశారు బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి. అమిత్‌షా తన ప్రసంగాల్లో ఎక్కడా ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించలేదని, కేసీఆర్ ఉపయోగించిన భాష ఆక్షేపణీయమని అన్నారు. అంతేగాక పార్లమెంట్‌లో బీజేపీ మద్దతు వల్లే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని గుర్తుచేసిన కిషన్ రెడ్డి, అమిత్ షా క్షమాపణ చెప్పాలనడం హాస్యాస్పదమన్నారు.
అంతేగాక కేసీఆర్‌‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన కిషన్‌రెడ్డి కేసీఆర్ ఒక్కరితోనే తెలంగాణ రాలేదని, అమిత్ షా ప్రకటనకు కట్టుబడి ఉన్నామని, మధ్యవర్తిని పెడితే నిరూపిస్తామని ప్రతి సవాల్ విసిరారు. రాజీనామా ప్రకటనకు కేసీఆర్ కట్టుబడి ఉండాలని, కేసీఆర్ బెదిరింపులకు ఎవ్వరూ భయపడరంటూ కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
మొత్తానికి అమిత్‌షా పర్యటనతో తెలంగాణాలో రాజకీయాలు మళ్ళీ ట్రాక్ ఎక్కాయి. వాద ప్రతివాదాలతో , సవాల్ ప్రతిసవాళ్ళతో రాజకీయం వేడెక్కింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.