రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు

Telugu States Destroying Spirit Of The Constitution
Telugu States Destroying Spirit Of The Constitution

(పాత చిత్రం)

రాజ్యాంగబద్ధ పదవులలో వున్నవారు రాజ్యాంగ స్ఫూర్తికి కలిసికట్టుగా తూట్లు పొడవటాన్ని భారతదేశ ప్రజాస్వామ్య వాదులు ఎలా అర్ధం చేసుకోవాలి.

రాష్ట్ర గవర్నర్, శాసనసభ సభాపతి, ముఖ్యమంత్రి ముగ్గురు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినవారే. రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తారని వాగ్దానం చేసినవారే. అటువంటి ఆ ముగ్గురు నేతలు అమరావతి సాక్షిగా రాజ్యాంగం మీద అత్యాచారానికి పాల్పడ్డారు.

ఒక పార్టీ గుర్తుమీద ఎన్నికైన సభ్యులు మరో పార్టీలోకి ఫిరాయించినపుడు వారి చట్టసభ సభ్యత్వం రద్దవుతుంది రాజ్యాంగం. కాని తెలంగాణలో గాని, ఆంధ్రప్రదేశ్ లో గాని ఫిరాయింపుదారుల చట్టసభ సభ్యత్వం రద్దుకాకపోగా వారికి మంత్రి పదవిని కట్టబెట్టారు. మంత్రివర్గ కూర్పు ముఖ్యమంత్రి ఇష్టమని అంగీకరించినా అది కూడా రాజ్యాంగ పరిధికి లోబడే జరగాలి. రాజకీయ ప్రయోజనము ఆశించి ముఖ్యమంత్రులు, ప్రధానులు తమ పరిధిని దాటి తమ పబ్బం గడుపుకునే యత్నం చేస్తారు. అటువంటి సమయంలో వారి తప్పును ఎత్తిచూపి, రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రులకు గర్తు చేయాల్సిన వాడు గవర్నర్. ఆయన స్వయానా రాష్ట్రపతి ప్రతినిధి. రాజ్యాంగ బద్ధంగా అత్యున్నత స్థానంలో వున్నవాడు. అటువంటి గవర్నర్ తెలంగాణలో ఒక ఫిరాయింపుదారుడి చేత మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించినపుడు రాష్ట్రపతి కలుగుచేసుకుని చక్కదిద్దాల్సింది. కాని రాష్ట్రపతి తనకేమి పట్టనట్లు, రాజ్యాంగ పరిరక్షణ తన బాధ్యత కాదన్న విధంగా వ్యవహరించాడు. ఫలితంగా ఇప్పుడు రెచ్చిపోయి ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా నలుగురు ఫిరాయింపుదార్లను మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించాడు.

గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ చర్యను ప్రజలు ఎలా అర్ధం చేసుకోవాలి? వై.కా.పా నుండి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన వారి సభ్యత్వం ఎందుకు రద్దు చేయ్యలేదని ప్రశ్నించాల్సిన గవర్నర్ ఫిరాయింపుదార్లను మంత్రులను చేయ్యటంలో ఉద్దేశ్యమేంటి? గవర్నర్ నరసింహన్ తెలంగాణలో తెలుగదేశం టికిట్ మీద గెలిచిన తలసాని మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించినపుడు తీవ్ర విమర్శలు కుప్పించిన వాడు చంద్రబాబు నాయుడు, ప్రజాస్వామ్యానికి దుర్దినం అని నాడు వర్ణించాడు. తెలంగాణలో నేడున్నది టి.ఆర్.ఎస్., టి.డి.పి సంకీర్ణ ప్రభుత్వంగా విమర్శించాడు.

నాడు చెప్పిన నీతులన్నీ పైపై మాటలేనని నేడు స్పష్టమైంది. నలుగురు వైకాపా సభ్యులను మంత్రివర్గంలో చేర్చుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టి.డి.పి., బి.జె.పి., వై.కా.పాలతో కూడిన సంకీర్ణ ప్రభుతవంగా తయారుచేశాడు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం ఎక్కడుంది?

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత శాసనసభ స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో శాసనసభలో వైకాపా బలం 66గా చూపించారు. అప్పటికే 21 మంది సభ్యుల వరకు నిర్లజ్జగా అధికార పక్షంలో కూర్చోవటం అందరికి తెలిసిందే. వారు వైకాపా సభ్యులని స్పీకర్ భావిస్తుంటే వారిని అధికార పక్షం సీట్లలో ఎలా కూర్చుంటాన్నారని అడగాల్సిన బాధ్యత స్పీకర్ ది కాదా? అయినా సదరు స్పీకర్ గారు ఆ విషయంలో పెదవి విప్పరు. ఎంతో పవిత్రంగా ప్రారంభించిన శాసనసభ తొలిరోజే అపవిత్రమైన సీటింగ్ ఏర్పాట్లను చూసింది. ఇదెక్కడి విడ్డూరం. దీనికి సమాధానం ఎక్కడ.

పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం తెచ్చిన తర్వాత కూడా ఆ చట్టంలో కొన్ని లొసుగులున్నాయి. గుంపుగా ఫిరాయింపు అవటానికి అవకాశం కల్పించడం చట్టంలోని మొదటి లోపం. ఫిరాయింపును ధృవీకరించి తగిన చర్య తీసుకొనే అధికారం శాసనసభ స్పీకర్ కి అప్పగించటం రెండవ లోపం.

పార్లమెంటు ఏర్పడిన 1950ల్లో స్పీకర్ గా వ్యవహరించిన మౌల్వాంకర్, అనంత శయనం అయ్యంగార్ వంటి వార్లు వ్యక్తిత్వం కలవారు. పార్టీ రాజకీయాలకు అతీతులు. అటువంటి వ్యక్తిత్వం కలవారు లేని కాలంలో స్పీకర్ కి ఫిరాయింపుదార్లను గుర్తించి, శిక్షించే బాధ్యత ఇవ్వటం హాస్యాస్పదం.

నేడు శాసనసభ స్పీకర్లు అధికార పార్టీ మనుషులు. ఎప్పుడు మంత్రి పదవి వస్తే స్పీకరు పదవి వదిలేద్దామా అని ఎదురు చూసేవారే. స్పీకర్ స్థాయిని తగ్గించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. స్పీకర్ గా వున్న వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది. లోక్ సభ స్పీకర్ గా వున్న బలరామ్ జక్కర్, శివరాజ్ పాటిల్ లను మంత్రులుగా చేసింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం స్పీకర్ స్థానాన్ని వాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య.

ఆ కాంగ్రెస్ సంస్కృతిని తిట్టిన తెలుగుదేశం, టి.ఆర్.ఎస్.లు తమ అవసరాల కోసం అదే సంస్కృతీ బాటలో నడుస్తున్నాయి. `తెలుగుదేశం` నుండి ఫిరాయించి తెలంగాణలో మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పై రెండేళ్లు అయినా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోడు. తాను తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చానని తలసాని స్వయంగా ప్రకటించాడు. అటువంటి రాజీనామా పత్రం తనకు అందలేదని తెలంగాణ స్పీకర్ ప్రకటిస్తాడు. ఇదోక పెద్ద రాజకీయ డ్రామా. దీనిలో ఎవరి పాత్ర ఎంతో తేల్చేయత్నం చెయ్యరు.

తెలంగాణలో జరిగిన శాసనసభ పార్టీ రాజకీయ డ్రామాని ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం 70 ఎం.ఎం.లో ప్రదర్శించింది. ఏకంగా నలుగురు వైకాపా సభ్యులకు మంత్రి పదవులు కట్టబెట్టింది. అధికారికంగా వైకాపా సభ్యులే వారు. శాసనసభలో వారు మట్లాడిన మాటల్ని వైకాపా ఎకౌంట్ లోనే వేసి చూపించాడు స్పీకర్. ఫిరాయించిన సభ్యుల సభ్యత్వం రద్దు చేయాలని స్పీకర్ కి ఫిర్యాదు చేసింది వైకాపా. అయినా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకునే తీరికి స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ రావుకి లేదు. ఎందుకంటే ఆయన టి.డి.పి మనిషి, మంత్రి పదవి ఆశిస్తున్న వ్యక్తి.

రాజకీయాలలో నైతిక విలువలను పాతరవేస్తున్న నేత చంద్రబాబు. పార్టీని ఫిరాయించినపుడు వారిని తమ పార్టీ సభ్యత్వానికే కాక ఎమ్.ఎల్.ఎ పదవికి రాజీనామా చేసి రమ్మని చెప్పి స్వాగతించి వుంటే చంద్రబాబు నాయుడిని మెచ్చుకునేవారం. కాని చంద్రబాబులో రాజకీయ సచ్ఛీలత వెతకటం అంటే నేతిబీరకాయలో నెయ్యి వెతకడం వంటిదే.

ఈ విషయంలో చంద్రబాబు కన్నా ప్రతిపక్షనేత జగన్ ఎంతో మెరుగు. కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చినపుడు తన ఎం.పి. పదవికి, తల్లి విజయమ్మ ఎమ్.ఎల్.ఎ. పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికయ్యారు. చట్టసభలో విప్ ని ధిక్కరిస్తే తమ సభ్యత్వం రద్దు అవుతుందని తెలసినా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ధైర్యంగా విప్ ని ధిక్కరించిన 16 మంది ఎమ్.ఎల్.ఎ లది నిబద్ధత. వారు తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. వారిలో ఒకరిద్దరు వైకాపా టికెట్ మీద పోటీచేసి ఓడిపోయి వుండవచ్చు. అయినా వారి నిబద్ధతను నిరూపించుకున్నారు. కాని ఆ సాహసం చేయించలేని పిరికివాడుగా చంద్రబాబు నాయుడు మిగిలిపోయాడు.

ఇదంతా ఒక రాజకీయ కుట్ర. ఆ కుట్రలో స్పీకర్ పాత్ర వుండటం విచారకరం. సభా విలువలు దిగజారటం. స్పీకర్లు రాజకీయ పావులుగా మారటం కొత్తేమీ కాదు. 1991 నుండి ఫిరాయింపులను కాంగ్రెస్ ఎలా ప్రోత్సహించినది, స్పీకర్ ఆఫీసును తమ రాజకీయాలకు అనుగుణంగా ఉపయోగించుకున్నది అందరికి తెలిసినదే. అందుకే ఫిరాయింపుదారులు, వారిపై చర్యల విషయంతో ప్రశ్నించే నైతికతను కోల్పోయింది కాంగ్రెస్. అయితే నైతికత వై.కా.పా.కి పార్టీగా ఉంది.

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చట్టసభ నిర్వహణ, స్పీకర్ సభా నిర్వహణ, అంశంలో విలువలు పూర్తిగా అడుగంటి పోయాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం చేసిన తీరు ఒక్కటి చాలు స్పీకర్ స్థానం ఎంతగా దుర్వినియోగం అయింది చెప్పటానికి. విభజన చట్టం ఓటింగ్ సమయంలో తలుపులు మూయించారు. డివిజన్ అడిగినా పట్టించుకోక మూజువాణి ఓటుతో మమ అనిపించారు. ఇంత దారుణంగా స్పీకర్ వ్యవహరించగలరని ఎవరూ అనుకోలేదు. భారత పార్లమెంట్ సంప్రదాయాలకు ఆనాడే కాలం చెల్లింది.

ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభల స్పీకర్లు సభా సాంప్రదాయాలకు పూర్తిగా పాతరవేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అండతో స్పీకర్లు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తుంటే ఉమ్మడి గవర్నర్ వారితో చేతులు కలిపి రాజ్యాంగ విలువలకు సమాధి కట్టాడు. ఇది రెండవ దుర్దినం. తొలి దుర్దినం పార్లమెంటులో విభజన చట్టం ఆమోదమైందని ప్రకటించిన రోజు, రెండవది ఫిరాయింపుదార్లచేత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించిన రోజు.

ఈ దేశంలోని అత్యున్నత న్యాయస్థాన తీర్పులను రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ తుంగలో తొక్కటం ద్వారా రాజ్యాంగ ధిక్కారానికి, కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డారు. ఒకసారి పార్టీ ఫిరాయింపు నిర్ణయం ప్రకటించిన తర్వాత ఆ సభ్యుడి సభ్యత్వ రద్దును కోరే హక్కు రాజకీయ పార్టీలకే కాదు, ఓటరుకు వుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ ఫిరాయింపుదారుల అనర్హత పిటీషన్ మీద స్పీకర్ తన నిర్ణయంలో టంబౌల్ గానీ, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా అనర్హతా పిటీషన్ ని పక్కనపెట్టి వుంచటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఫిరాయింపు అంశం ధృవీకరించుకోవటానికే స్పీకర్ కి సమయం యిస్తుందని చట్టం. అంతేకానీ తన ఇష్టమొచ్చినంత కాలం పిటీషన్లను పెండింగులో పెట్టి వుంచుతాననేది ఫిరాయింపు నిషేధ చట్ట స్పూర్తికి వ్యతిరేకం.

ముఖ్యమంత్రికి మంత్రులను ఎంచుకునే హక్కు రాజ్యాంగం యిచ్చింది. తన పార్టీ వారిని లేదా ఏ పార్టీకి చెందని వారిని ఎంచుకునేందుకు కాని ఇతర పార్టీల సభ్యులను ఎంచుకునే హక్కు లేదు. ఈ విషయం గవర్నర్ ముఖ్యమంత్రికి ఎత్తిచూపకపోవడం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అలసత్వం. మంత్రివర్గ నిర్మాణం, మంత్రివర్గ నిర్ణయాల మధ్య ఉన్న తేడాను గవర్నర్ విస్మరించాడు.

గవర్నర్, స్పీకర్ కి విచక్షణాధికారాలను రాజ్యాంగం యిచ్చింది. అయితే ఆ విచక్షణాధికారాలను దుర్వినియోగం చేసినపుడు న్యాయస్థానాలకు జోక్యం చేసుకునే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజాగా వెలువరించిన అరుణాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాల ఏర్పాటు, శాసన సభలను సస్పెన్షన్ లో పెట్టడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. గవర్నర్లు రాజకీయాలు నడపటం తప్పని హెచ్చరించింది కూడా.

ఇవన్నీ బహిరంగ అంశాలే అయినా వాటిని పక్కనపెట్టి గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కుమ్మక్కు అవటం నిరశించదగిన విషయం.

ఫిరాయింపుదార్లకు మంత్రి పదవులెందుకు కట్టెబెట్టాల్సి వచ్చిందో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంత వరకు వివరించలేదు. తను రాజకీయ స్వప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని, చట్టాలను బేఖతారు చేయగలమన్న నియంతలాగా ప్రవర్తించారు కే.సి.ఆర్., చంద్రబాబు. తమ సొంత పార్టీలో మంత్రి పదవులు నిర్వహించగలిగిన సమర్ధులు లేరా?

చంద్రబాబు చెపుతున్న సామాజిక వర్గాల సమతుల్యం కోసం మంత్రివర్గ పునర్విభన అన్నది అతి పెద్ద అబద్ధం. అదే నిజమైతే మంత్రివర్గంలోని తన సామాజికవర్గ మంత్రులను తొలగించి ఉండాల్సింది. నిజానికి మంత్రివర్గంలో ఆ సామాజిక వర్గం వారి సంఖ్య అధికం. అయినా ఒక్కరిని తొలగించకపోగా అదే సామాజిక వర్గానికి చెందిన లోకేష్ ని మంత్రి చేశాడు. సమాజానికి చంద్రబాబు ఇస్తున్న సందేశం ఏమిటి? టి.డి.పి మా సామాజిక వర్గ పార్టీ, ప్రభుత్వం మా సామాజిక వర్గం పెత్తనం కింది పడివుండాల్సిందే అనేనా?

ఎల్లకాలం ఒక సామాజిక వర్గ ఆధిపత్యం చెల్లదు. స్పీకర్ మహిళా కమీషన్ ఛైర్మన్, ఎం.పి.పి.ఎస్.సి. చైర్మన్, రాష్ట్ర ఎన్నికల కమీషనర్, ఐటి సలహాదారు, ఆర్ధిక సలహాదారు, తెలుగు అకాడమి ఛైర్మన్, ఎన్.ఆర్.ఐ. సలహాదారు, ఇలా నామినేటెడ్ పదవులన్నీ తన సామాజిక వర్గానికే కట్టబెడతానంటే మిగిలిన సామాజిక వర్గాలు మౌనంగా ఉంటాయనుకుంటే చంద్రబాబు పొరపడినట్లే. ఆంధ్రప్రదేశ్లో 2019 నాటికి 1989 నాటి సామాజికి ఘర్షణ వాతావరణం నెలకొనబోతున్నది. ఆ ఘర్షణ వాతావరణ సృష్టికర్త చంద్రబాబు తాను పెట్టిన సామాజిక చిచ్చుకు తానే బలికాక తప్పదు.

-ఆంధ్రభూమి సౌజన్యంతో

అడుసుమిల్లి జయప్రకాష్

Have something to add? Share it in the comments

Your email address will not be published.