‘ప్రజల ఆకాంక్ష – నిరంకుశ పాలన మధ్య ఘర్షణ’ : కోదండరాం

TJAC Chairman Prof.Kodandaram fires on TRS Government

TJAC Chairman Prof.Kodandaram fires on TRS Government

  • మన పాలకుల్లో ఫ్యూడల్ మనస్తత్వం చాలా బలంగా కనిపిస్తోంది
  • ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలు ప్రశ్నించటం అస్సలు ఇష్టంలేదు
  • ప్రభుత్వం తమ ఆలోచనలు మార్చుకోకుండా పోలీసులను ప్రయోగిస్తే నిరసనలు ఆగిపోతాయని అనుకుంటే పొరపాటు
  • ప్రజల పక్షాన టీజాక్ పోరాటం కొనసాగుతుంది

తెలంగాణ సంయుక్త కార్యాచరణ సంఘం (టీజేఏసీ)ని అణచివేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. ప్రభుత్వంతో రాజీపడే ప్రసక్తి లేదనీ, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామనీ, ప్రశ్నించడం అన్నది ప్రజాస్వామ్యంలో పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కు అనీ జేఏసీ సారథి ప్రో కోదండరాం అంటున్నారు. కోదండరాం కాంగ్రెస్ పార్టీ బంటుగా వ్యవహరిస్తున్నారనీ, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికీ, ప్రాజెక్టులను అడ్డుకోడానికీ జేఏసీ ప్రయత్నిస్తున్నదని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ప్రొఫెసర్ కోదండరాంను అర్ధరాత్రి అరెస్టు చేసి పాతబస్తీలో పోలీసు స్టేషన్ కు తరలించిన ఉదంతం తర్వాత ప్రభుత్వం పట్ల జేఏసీ వైఖరి ఏమిటి? జేఏసీ స్టీరింగ్ కమిటీ నుంచి ముగ్గురు సభ్యులు వైదొలిగిన తర్వాత వారు చేస్తున్న ఆరోపణలలో నిజం ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కోసం సకలం ప్రత్యేక ప్రతినిధి శరత్‌చంద్ర టీజేఏసీ అధినేత ప్రొఫెసర్ కోదండరాంతో చేసిన ఇంటర్వ్యూలో ప్రధానాంశాలు:

ప్ర: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంకోసం మీరూ, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులూ కలసి ఉద్యమం చేశారు. తీరా తెలంగాణ స్వప్నం సాకారమైన తర్వాత మీరు ఇంకా ఉద్యమం బాటలోనే ఉన్నారు. ప్రభుత్వం జేఏసీని అణచివేయడానికి సకల చర్యలూ తీసుకుంటోంది. ఇటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది?

జ: మన ప్రభుత్వం వ్యక్తిగతంగా నామీద కానీ జెఎసి మీద కానీ చేస్తున్నటువంటి దాడి వేరు వేరు కాదు. ఒకే నాణానికి  అవి రెండు ముఖాల వంటివి. ప్రధానంగా జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన అప్రజాస్వామిక లక్షణం ఉంది. వాళ్ళ దృష్టిలో పాలకులు సర్వజ్ఞులు. ఇంక వాళ్ళకు తెలియని విషయమంటూ ఏమీ ఉండదు. అట్లాంటి వాళ్ళకు అన్నీ వదిలి పెట్టాలి. అంతే తప్ప మనం ప్రజలు కదా అని ప్రతీసారి ప్రశ్నించడం అభివృద్ధికి ఆటంకమని భావిస్తున్నారు. అవసరమైతే మద్దతు ఇవ్వాలి. అదీ వీలుకాకపోతే మౌనంగా ఉండాలి. ఇది ప్రజల నుండి వాళ్ళు కోరుకుంటున్న వాతావరణం. అందుకని ఇందులో ఎవ్వరైనా తెగించి ప్రశ్నించినా దానికి తీవ్రమైన అసహనంతో ప్రతిస్పందిస్తున్నారు. ప్రశ్నించటం అస్సలు ఇష్టంలేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ఒక వ్యవస్థ ఉండడం అనేది చాలా అవసరం. అలాంటిది ఉన్నప్పుడే ప్రభుత్వాలు బాధ్యతగా పనిచేస్తాయి.

ప్ర: ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చినవారిని పరిపాలన చేయనివ్వాలి కదా. అడుగడుగునా అడ్డుతగులుతున్నారనే ఆరోపణకు మీ సమాధానం ఏమిటి?

జ:అంబేద్కర్ ఒక విషయం పదే పదే చెప్పేవారు. ఎన్నికలకు ఎన్నికలకు మధ్య ప్రజలు క్రియాశీలంగా ఉండి చైతన్యాన్ని ప్రదర్శిస్తేనే ప్రభుత్వాలు కూడా బాధ్యతగా పనిచేస్తాయి. ప్రజాస్వామ్యం బలపడుతుందని చెప్పారు.కానీ మన పాలకులు అలాంటి ప్రశ్నించేవాళ్ళు, ప్రభుత్వానికి ఎదురు మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ ఉండకూడదనీ, డిమాండ్ల సాధనకోసం ఎవరూ ఆందోళనలు చేయకూడదనేది వాళ్ళ ఆలోచన. అందవల్ల జెఎసి మీద వస్తున్న కోపం అనేది ఈ పరిస్థితుల నుండే వస్తోంది.  జేఏసీలో ఉన్న వాళ్ళు ప్రశ్నించటమనేదే ఇష్టంలేదు కాబట్టే జేఏసీ మీద పెద్ద ఎత్తున దాడికి పూనుకుంటున్నారు. మేమెప్పుడూ ఏ కార్యక్రమం చేసినా పర్మిషన్ ఇవ్వరు. గతంలో మేము రైతుజేఏసీ కార్యక్రమానికి మద్దతు తెలిపినప్పుడు కూడా చాలా ఇబ్బందిపెట్టి సతాయించి పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత నిర్వాసితుల దీక్ష చేసినప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఇంటి దగ్గరినుండే దీక్ష చేసి నిరసన తెలిపాం. ఈ మధ్య నిరుద్యోగ ర్యాలీకి కూడా పర్మిషన్ ఇవ్వబోమన్నారు. మేం కోర్టు వరకూ వెళ్ళాం. ఆదివారం పెట్టుకోమన్నారు. శివరాత్రి తరువాత కుదరదని చెప్పాం. అదే టైంలో నిజాం కాలేజీ ఖాళీగా ఉన్నప్పటికీ మాకు ఇవ్వకుండా రింగ్‌‌రోడ్ దగ్గర పెట్టుకోమంటే మేము ఒప్పుకోకపోవడంతో సుమారు 13 వేలమందిని రాత్రికి రాత్రే అరెస్ట్ చేశారు. ఇళ్ళపై దాడి చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి తరలించారు. ఇంత దాడి చేసే సరికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.

ప్ర: వ్యక్తిగతంగా మీపైన దాడి చేయడంలో ఉద్దేశం ఏమిటి? జేఏసీలో చీలిక ఎందుకు వచ్చింది? అందులో మీ బాధ్యత ఎంత?

జ: వ్యక్తిగతంగా మాపైన దాడి చేయాలని ప్రభుత్వం ఆలోచనకు వచ్చి వ్యక్తిగతదాడి చేస్తే మొత్తం పరిస్థితిని నియంత్రించవచ్చనేది వాళ్ళకున్న ఆలోచన. జేఏసీగా మాకు ఇది కొత్త ఏమీ కాదు. కానీ ఈ సారి కొత్త అంశం ఏంటంటే మాలో ఉన్న ఒకరిద్దరితో మాపై వ్యక్తిగత దాడి చేయించాలని అనుకున్నారు. కాబట్టి దానివల్ల జేఏసీ చెదిరిపోతుందని , జేఏసీ ప్రతిష్ఠకి కొంత మచ్చ వస్తుందనేది ఒకటైతే , చర్చను పక్కదారి పట్టించవచ్చనేది రెండో అంశం. కానీ వాస్తవం ఏంటంటే ప్రభుత్వం అనుసరించే అప్రజాస్వామిక ధోరణులు ఇంత బలంగా ఉన్న సందర్భంలో వాళ్ళు వేసే ఎత్తుగడలు పారవు. ఇవాళ ఒకరుపోతే పదిమంది నిరసన తెలిపే పరిస్థితి వచ్చింది. ఇంతవరకు జేఏసీకే  పరిమితమైన ఈ అనుభవం ఇప్పడు అందరికి ఎదురౌతోంది. ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలకు అనుమతి ఇవ్వము. సిటీలోనే నిరసన కార్యక్రమాలు ఉండవు అంటున్నారు. ఎక్కడైనా, ఆఖరికి ఇంగ్లండ్‌లో హైడ్ పార్క్ దగ్గర , అమెరికాలో వైట్ హౌజ్ దగ్గర నిరసన తెలపాలంటే పర్మిషనే అవసరంలేదు. ఇవాళ మనదగ్గర ఇందిరాపార్క్ దగ్గర పర్మిషనే లేకుండా చేస్తున్నారు. ఇందిరాపార్క్ దగ్గర టెంట్లే లేవంటే పరిస్థితి ఇదా అనే స్థితికి వచ్చాం. ఇంతటి దుర్మార్గమైన వైఖరిని అవలంబించేసరికి ఇవాళ చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎక్కడికక్కడ అందరూ కదులుతున్నారు. ప్రభుత్వం తమ ఆలోచనలు మార్చుకోకుండా పోలీసులను ప్రయోగిస్తే నిరసనలు ఆగిపోతాయని అనుకుంటే పొరపాటు. ఒకటి అణిస్తే పది పుట్టుకొస్తాయి. అదే వాస్తవంగా ఈరోజు అనుభవంలోకి వస్తున్న సందర్భం ఇది.

ప్ర: ప్రజా ఉద్యమాలను అణచివేయడం సాధ్యమేనా? బలమైన ప్రభుత్వాన్ని ఎదుర్కొని మీరు నిలబడగలరా?

జ: ముఖ్యంగా తెలంగాణాలో 1996లో ప్రారంభమై 2014వరకు సాగిన దాదాపు 20 సంవత్సరాల ఉద్యమ ఫలితంగా ప్రజల్లో ఒక ప్రజాస్వామిక స్ప‌ృహ ఏర్పడి, చైతన్యం బలపడింది. ఇంతబలంగా చైతన్యం ఉన్నప్పుడు దాన్నిరాజకీయంగా అణచడం కానీ , చట్టాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకొని నిరసనలేకుండా అణచడం కానీ సాధ్యం కావు. అందుకే ప్రభుత్వ పాచికలు ఏవీకూడా పారడం లేదు. రెండు రోజులపాటు గాలిదుమారం పత్రికల్లో కనిపించొచ్చుకానీ ఆతర్వాత అన్నీ సమసిపోతాయి. యథతథంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. జేఏసీగా మాకు ఒక కార్యాచరణ ఉంది దాన్ని మేము కొనసాగిస్తాం. స్పష్టంగా ఈరోజు కనిపిస్తున్న విషయం ఏంటంటే, ప్రజల్లో ఉన్న ఆకాంక్ష ఒకవైపైతే, నిరంకుశంగా పరిపాలన చేయలని తాపత్రయం మరోవైపు ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఈరెండింటి మధ్య ఒక తీవ్రమైన ఘర్షణ కొనసాగుతోంది. ప్రపంచంలో ఎక్కడైనా నిరంకుశ పాలన నిలవలేదు. అంతిమంగా ఒక ప్రజాస్వామిక చైతన్యమనేదే నిలబడింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా చిట్టచివరికి ప్రభుత్వం అనుసరించే విధానాలే వైఫల్యం చెందుతాయి. మేము ప్రజల హక్కుల సాధన కోసం చేస్తున్న మాపోరాటాలే గెలుస్తాయి నిలుస్తాయని మాకు సంపూర్ణగా విశ్వాసం ఉంది.

ప్ర: పరిస్థితులు పరిపక్వం కాకుండానే ప్రత్యక్ష కార్యాచారణకు పిలుపునివ్వడం తొందరపాటు నిర్ణయం అనే అభిప్రాయం ఒకటి ఉంది. మీ అభిప్రాయం ఏమిటి?

జ: వాస్తవానికి మొదట ఒక సంవత్సరం అంతా రకరకాల పద్ధతుల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేశాం. ఏదో కొంత మంత్రులకు తెలుస్తున్నాం.  అధికారులు సమస్యలను గుర్తించగలుగుతారు కొంత పరిష్కారమౌతాయనే ఆలోచన, ఆశ మా అందరిలో ఉండేది. కానీ ఆ ఆశ ఎక్కువ రోజులు నిలవలేదు. పరిష్కారం కాకపోయే సరికి పత్రికల ద్వారా వినిపించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో చివరికి కొన్ని ఆందోళన కార్యక్రమాలు తీసకోవాల్సి వచ్చింది. మేం తీసుకున్నవి కూడా ఆందోళన కార్యక్రమాలే. వాస్తవానికి ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ నిరంకుశ వైఖరి అనేది సమంజసం కాదు. ఏ సమస్యలపైన అయినా ప్రజలు ఆందోళన చేస్తున్నప్పుడు వాటిని వినాలి, పరిష్కారించాలనేది ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఆ బాధ్యతను నిర్వహించే బదులు మరింత నిరంకుశంగా వ్యవవహరించాలని చూస్తున్నాయి. ఇదే నా ద‌ృష్టిలో తెలంగాణాలో ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఒక ప్రధానమైన సమస్య. ఇటు ప్రజల ఆకాంక్ష, పాలకుల్లో ఉన్న ఆధిపత్య ధోరణి. ఈ రెండిటి మధ్య పొసగడంలేదు. ప్రభుత్వం తన ధోరణి మార్చుకొని ప్రజలకు ఉండేటువంటి ఆంకాక్షల ప్రకారం అందిరినీ నిర్ణయాల్లో భాగస్వామ్యం చేస్తూ , అందరి ఆంకాంక్షలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి తన అధికారాన్ని వినియోగించగలిగతే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ పూర్తి నిరంకుశంగా అందరినీ అణచిపారేస్తామన్న ఆలోచనతో పాలకులు వ్యవహరిస్తే అప్పుడు సమస్య జటిలమౌతుంది. ఈరోజు తెలంగాణాలో జరగుతున్నది కూడా అదే.

ప్ర: ప్రజాస్వామ్య పద్ధతులలో నడుస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఎందుకు? ప్రభుత్వం ప్రజలకోసమే పని చేస్తున్నది కదా. ఘర్షణాత్మక వైఖరి ఎందుకు?

జ: మామూలు స్థాయిలో చెప్పాలంటే అడగనిదే అమ్మ అయినా పెట్టదనేది మన దగ్గర ఉన్ననానుడి. ఇక ప్రభుత్వాలను ఇంకా గట్టిగా అడిగే అధికారం ఉంటుంది కదా. వెనకటి రాజరికపాలనలో ప్రజలకు అడిగే అధికారంలేదు. సర్వాధికారాలు పాలకులకు ఉండేవి. ఆ సర్వాధికారాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రజలదే అన్న ఆలోచనతో అప్పటి సమాజాలు నడిచాయి. ప్రభుత్వానిది గుత్తాధిపత్యం. దానికి లొంగి ఉండటం ప్రజల బాధ్యత. ఇది ఆ రోజు సమాజం రీతి రివాజు.  కానీ ప్రజాస్వామ్యంలో పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వాలను ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంటుంది. నిలదీసే హక్కు ఉంటుంది. ఆ హక్కును పరిరక్షించడమే ప్రభుత్వాల బాధ్యతగా ఇప్పుడు మన ప్రజాస్వామ్య సంప్రదాయాలు అనేవి బలపడ్డాయి. ఈ సంప్రదాయాలు వచ్చిన తర్వాత ఇంకా ప్రశ్నించకూడదు అని అంటున్నారంటే మనం మన కాలచక్రాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నం చేస్తున్నట్టు లెక్క. అది ఇంకా సాధ్యం కాదు. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయాయి. నిజాం పాలన పోయింది. ఆ నాటి రాచరిక పాలనలో ఉన్న నిరంకుశత్వం పోయింది. పాలకులను ప్రశ్నించడానికి వీలులేదనే ఒక ఆధిపత్య ధోరణికి ఇప్పుడు కాలం చెల్లిందనే భావన ప్రబలింది. ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రభుత్వాలు ప్రజల సేవకులు. ఆ ప్రభుత్వాలు ప్రజలపట్ల బాధ్యతతో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేయాలనేది ఆలోచన. దీంట్లో ప్రశ్నించే హక్కు ప్రజాస్వామిక సౌధానికి మూలస్తంభం. ప్రశ్నించడం, నిరసన తెలపడం, సంఘాలు పెట్టుకోవడం, భావవ్యాప్తికి పాల్పడటం ఇవన్నీ ప్రాథమిక హక్కులు. అవన్నీ లేకపోతే ప్రజాస్వామ్యం లేదు కదా. కానీ దురదృష్టవశాత్తు మన పాలకుల్లో ఒక ఫ్యూడల్ మనస్తత్వం అనేది చాలా బలంగా కనిపిస్తోంది. ఎవ్వరూ మాకు ఎదురు తిరగరాదు. మేము మా ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తుంటాం మీరందరూ మాకు విధిగా సహకరించాలి అనే ధోరణిలో పాలకులు వ్యవహరిస్తున్నారు. అది నా దృష్టిలో ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరైన ధోరణి.

ప్ర: చైతన్యం కలిగించే వ్యవస్థగానే పని చేస్తామని చెబుతూ రాజకీయాలు చేస్తున్నారనేది మీ పైన ప్రధాన విమర్శ. మీరు ఏమంటారు?

జ: మేము మొదటినుండి ప్రజాసంఘాలుగానే ఉన్నాము తప్ప పార్టీల్లో చేరలేదు. స్వతంత్రంగా కార్యక్రమాలు చేపట్టాం. అవసరమైనప్పుడు సంఘీభావంతో ముందుకు సాగాం. 2009 వరకు ఆ రకంగా ఎవరికివాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాం. 2009  తర్వాత అందరం కలిసి ఏకోన్ముఖంగా సాగవలసిన సందర్భం వచ్చినప్పుడు కలిసి నడిచాం. అప్పుడు కూడా మా మధ్య వైరుధ్యాలు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ ప్రజంలదరినీ కదిలించడానికి అలాంటి వేదిక అవసరమైంది.  సంఘటితంగా ఉద్యమాలు నిర్మించడానికి,  ప్రజలందరినీ ఒకేదారిలో నడిపించడానికి  ఇలాంటి ఒక ప్రయత్నం అవసరం కావడంతో వైరుధ్యాలను కొంతమేరకు పరిష్కరించుకొని కొంతమేరకు భరిస్తూ మొత్తం మీద రెండు వైపులా పరిమితులను అంగీకరిస్తూ ముందుకు నడవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకు ఏమనిపిస్తుందంటే ఈ సర్దుబాటు ఇంక అవసరంలేదు. ఇకమేము మా పద్ధతుల్లో మేము నడుచుకుంటాం. ఇక వేరే వాళ్ళు ఎవరూ అడగడానికి వీలు లేదు. ఇంకొక వేదిక అవసరంలేదు. మేమున్నాం. ప్రభుత్వం నడిపిస్తాం. తమను ప్రశ్నించే అవసరం లేదనే ధోరణిలో ఉన్నారు. అందుకనే వ్యవస్థలన్నింటినీ నీరుగార్చే  ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలుండకూడదు. ఒకవేళ ఉంటే బలమైన నాయకులు మావెంటే కలిసిరావాలి. సంఘాలు ఉండకూడదు. అవన్నీ విచ్ఛిన్నం కావాలి. ప్రశ్నించేవాడు ఉండకూడదు. వాళ్ళమీద అవసరమైతే దాడిచేసి బురదరాసి ప్రతిష్ఠను దెబ్బకొట్టి వాళ్ళకుండే పలుకుబడిని నాశనం చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ దాంట్లో ఉన్నటువంటి భాగాలే. ఇదీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. నాదృష్టిలో ఇది నిలబడదు. ఇది ఒక అవగాహనా రాహిత్యం. అందువల్ల ఒక విచిత్రమైన పరిస్ధితి ఏర్పడుతున్నది.  పాలకులకి తమ నీడను చూస్తే తామే భయపడే పరిస్థితి. ఎవరు ప్రశ్నిస్తే ఏమైపోతుందనే ఉలికిపాటు కనిపిస్తోంది. ఇది ఇవాళ విచిత్రమైన పరిస్థితి. ఇంత భయంలో ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళను బహుశా భారతదేశంలో ఈ మధ్యకాలంలో  ఎన్నడూ చూడలేదు. ప్రతీ ఒక్కళ్ళని చూస్తే ఉలికిపాటే, భయమే. చుట్టూ పోలీసులని పెట్టుకొని విపరీతంగా వాళ్ళని ప్రయోగించి తమ కుర్చీని కాపాడుకోవాలనుకొనే తాపత్రయంతో ఉన్నవాడు ప్రజలకోసం పరిపాలన ఏం చేస్తాడు? చెయ్యలేడు. అది ఈవాళ ఉన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి.

ప్ర: మీరు ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ కొందరు మీ పాత సహచరులు ఆరోపిస్తున్నారు? మీరు ఏమంటారు?

జ: ఇప్పటి జేఏసీ ప్రజాసంఘాల జేఏసీగానే ఉండాలని మేము నిర్ణయించున్నాం. అన్ని విధానపరమైన నిర్ణయాలు విస్తృతస్థాయి సమావేశంలో తీసుకుంటాం. నిర్ణయాల అమలును స్టీరింగ్ కమిటీ పర్యవేక్షిస్తూ ఉంటుంది. అన్ని నిర్ణయాలూ  ఆ స్థాయిలోనే జరుగుతుంటాయి. అందుకని ఏ ఒక్క వ్యక్తో ఏదైన ఒక సంస్థను నడిపిస్తుంటే వెనకనుండి ఇలా ఎవరైనా ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం అనేది జేఏసీలో జరగదు. ఏ నిర్ణయమైనా అందరం కలిసి సమష్టిగా తీసుకుంటాం కాబట్టి అలాంటిది ఏం జరగదు. పార్టీలతో సంబంధం ఉండదా అన్న ప్రశ్నకు సమాధానం మేం చాలాసార్లు చెప్పాం. అవసరమైన సందర్భాల్లో ఏదైనా సమస్య పరిష్కారం కోసం తప్పకుండా పార్టీలను కలవవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి 2016 భూసేకరణ బిల్లును అసెంబ్లీలో తెచ్చినప్పుడు దాన్ని ఆపాలంటే పార్టీల సహాయం తప్పదు కదా. అట్లాంటి సందర్భాల్లో కలిశాం. ఇప్పుడు ధర్నా చౌక్‌ను కాపాడుకోవాలి. దానికి అటు అసెంబ్లీలో ఇటు బయట ఒక ఆందోళన సాగాలి. తప్పకుండా పార్టీల సహకారం మద్దతు  ఏ మేరకు అవసరం అయితే ఆ మేరకు తీసుకోవాల్సి వస్తుంది. పార్టీలు ప్రజాస్వామ్యంలో భాగం కాబట్టి వాటిని విస్మరించలేం కదా. ఏ ఆందోళన చేసే వాళ్ళకైనా ఆ పార్టీలతో ఏదో ఒక సందర్భంలో  ఏదో ఒక స్థాయిలో ఏదో కొంత మేరకైనా మాట్లాడక తప్పని పరిస్థితి ఉంటుంది. అయితే ఆ సంబంధం అనేది స్వచ్ఛందంగా జేఏసీ తాను నిర్ణయించుకున్న మేరకే కొనసాగుతుంది.

శరత్‌చంద్ర

Have something to add? Share it in the comments

Your email address will not be published.