అటూ… ఇటూ… ‘వీర’భక్తులు తెచ్చిన విపత్తులు

Troubles For Naidu, Jagan On Account Of Overzealous Loyalists

Troubles For Naidu, Jagan On Account Of Overzealous Loyalists

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడైనా, ప్రతిపక్ష నేత జగన్‌ అయినా వారి వారి బలాలూ బలహీనతలూ వారికి వున్నాయి. రాజకీయంగా విధాన పరంగా ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం నడవాలే తప్ప ఎవరిపట్ల వీరభక్తి వల్ల ఉపయోగం లేదని నేను చాలా సార్లు రాస్తుంటాను. ఇలాటి శ్రుతిమించిన భక్తివల్ల పరమానందయ్య శిష్యుల కథలో వలె అనుకోకుండా నష్టం చేసినవారవుతారని ఇటీవల కూడా హెచ్చరించాను. ఇలా ఎన్నిసార్లు ఎన్నిచెప్పినా అధికారం కోసం లేదంటే ప్రాపకం కోసం భజన చేసేవారి బుద్ధి మారదు. ఇచ్చకాలు అంటే పై వారికి నచ్చినట్టు మాట్లాడి సంతోషపెట్టి స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడం ఒక జాడ్యంగా మారుతుంది. గత రెండు మాసాలలోనూ అలాటి అనేక సమస్యలు రెండు వైపులా చూస్తూనే వున్నాం. చెదురుమదురుగా ఇడి జప్తులు తప్ప సిబిఐ వైపు నుంచి పెద్ద కదలిక లేని జగన్‌ కేసు (సాంకేతికంగా అక్రమాస్తుల కేసు)లో బెయిలు రద్దు చేయాలంటూ సిబిఐ నాలుగేళ్ల తర్వాత ముందుకు రాగలిగిందంటే ఆలోచనా రహితమైన అత్యుత్సాహమే కారణం.

మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డిని ఆ విషయాలు ప్రశ్నించడం, సిబిఐ అవగాహన లేకుండానే ఇదంతా చేస్తున్నట్టు చెప్పించి బాధ్యుడైన నాటి జేడీ లక్ష్మీనారాయణ కూడా ఆ సంగతి ఒప్పుకున్నట్టు భావన కలిగించడం ఆ కోవకు చెందినదే. పైగా ఆ వార్తను సంచలన వార్తగా ప్రచారంలో పెట్టారు. ఆ కోవలో మరిన్ని కథనాలు ఇంటర్వ్యూలు కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. సోషల్‌ మీడియాలో భక్తులు వాటిని వైరల్‌ చేయడానికి సిద్దంగానే వుంటారు. అంతాకలసి కలిగిన ఫలితం సిబిఐని తట్టిలేపడం. అందుకొక సాకు సమకూర్చిపెట్టడం. కేసుల్లో విచారణనెదుర్కొంటున్నవారు బెయిలుపై వుంటే దాని గురించి ప్రతికూలంగా మాట్లాడకూడదనేది ఒక న్యాయసూత్రం. పైగా రమాకాంత రెడ్డి ఈ వ్యవహారాలతో సంబంధం లేని తటస్థ వ్యక్తి కాదు. ఇప్పుడు సిబిఐ పిటిషన్‌లో సమర్థనగా వాదిస్తే మరింత నష్టం కలగొచ్చు. బహుశా ఈ ఇంటర్వ్యూ గురించి తనకు తెలియదని, కోర్టుపట్ల పూర్తి నమ్మకం వుందని చెప్పి జగన్‌ బయిటపడాల్సివుంటుది. ఇకముందు తన మీడియాలో ఇలాంటి అత్యుత్సాహాలకు కళ్లెం వేయవలసి వుంటుంది. గవర్నర్‌ నరసింహన్‌ వేడుకల్లో చంద్రబాబు కన్నా జగన్‌ను బాగా స్వాగతించారనే క్లిప్పింగు ఒకటి విడుదల చేశారిపిప్పుడు. జగన్‌కు మొహమాటం ఎక్కువని మరో విడియో. ఇవన్నీ ఆయనను చిక్కులో పెట్టే పనులే తప్ప మేలు చేయవు.

ఇది చంద్రబాబుకూ వర్తించే సమస్యనే. నారాయణ హైస్కూలు పేపరు లీకేజి గాని, విజయవాడ డాడి గాని యాదృచ్చికంగా జరిగినవి కావు. ఈ రోజు ఉగాది వేడుకల్లో నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఏకంగా ముద్దే పెట్టేసుకున్నారు. శాసనసభలో స్వంతపార్టీవారే గాక బిజెపి నేత విష్ణుకుమార్‌ రాజు వంటివారు కూడా పోటీ పడి పొగిడేస్తున్నారు. ఇంకా మంత్రివర్గంలోకి రాని లోకేశ్‌నూ అలాగే ఆకాశానికెత్తుతున్నారు. ఇదంతా చివరకు ఎక్కడకు తీసుకువెళ్తుందో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. జగన్‌ను తిట్టడం తనను పొగడ్డం ఒక అర్హతగా భావించే స్థితి మారాలి. ఓటుకు నోటు ఈ దిశలో పెద్ద హెచ్చరిక. మాట్లాడితే చంద్రబాబు అన్ని కేసులనుంచి క్లీన్‌ చిట్‌ పొందినట్టు చెప్పేవారు ఆ జాబితా ప్రచురిస్తే చాలా బాగుంటుంది. లేదంటే మౌనంగా వుండటం మేలు. ఎందుకంటే ఆయా సమయాల్లో గట్టెక్కించిన స్టేలు ఇతర ఉత్తర్వులలో మెలికలు చాలా వుండొచ్చు. అదేపనిగా కెలికితే రేపు అవే అడ్డం తిరగొచ్చు. ఎవరి వాదన వారు చేసి న్యాయాన్ని కోర్టులకు వదలిపెట్టడమే శ్రేయస్కరం.

తెలకపల్లి రవి

Have something to add? Share it in the comments

Your email address will not be published.