ఓ వైపు ప్రచార ఆర్భాటాలు… మరోవైపు రైతుల కంట్లో కారం

TRS Boast of development while simmering anger of Chilli farmers ride the heat in Telangana

TRS Boast of development while simmering anger of Chilli farmers ride the heat in Telangana

తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణా రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవానికి  ఓరుఘల్లుని అంగరంగ వైభవంగా ముస్తాబుచేసి కోట్ల రూపాయలు ధారాళంగా ఖర్చుపెడుతుంటే మరోవైపు కనీస మద్దతు ధర ఇప్పించండి మహాప్రభో అంటూ మిర్చి రైతులు రోడ్డెక్కుతున్నారు. రైతు సంక్షేమమే తమ లక్ష్యంగా చెప్పుకొనే టిఆర్ఎస్‌ రైతులను ఏమాత్రం పట్టించుకోకుండా బంగారు తెలంగాణా ఎలా సాధిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మేం రైతులను చాలా బాగా పట్టించుకుంటున్నామని ఎవరైనా అధికార పార్టీ నాయకులు చెబుతుంటే మరి ఈ రోజు ఖమ్మం మార్కెట్ యార్డులో జరిగిన సంఘటనను ఏవిధంగా అర్థం చేసుకోవాలి.

ఆకలి తీర్చే రైతన్నకు ఆగ్రహం వస్తే ఏం చేస్తాడో ఈరోజు ఖమ్మం మార్కెట్ యార్డులో జరిగిన ఘటనే సజీవ సాక్ష్యం. గత కొన్ని రోజులుగా మద్దతు ధర లభించట్లేదంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టి తమ ఆగ్రహాన్ని బయటపెడ్తున్న మిర్చి రైతులు తమ కోపానికి అణుచుకోలేక బయటపెట్టారు. దాంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఉద్రిక్తత ఏర్పడింది. మార్కెట్‌కు  భారీగా మిర్చిని తీసుకొచ్చిన రైతులు  మిర్చి ధర క్వింటాల్‌కు 3 వేల రూపాయలకు పడిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖమ్మం మిర్చి మార్కెట్‌లో రైతులు ఆందోళన చేపట్టారు.

కష్టపడి పండించిన పంటకు వ్యాపారుల కారణంగా గిట్టుబాటు ధర కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా రాకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని మిర్చి రైతులు ఆరోపిస్తున్నారు. అంతేగాక ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నా ఒక్క అధికారి కూడా తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చియార్డు పాలకవర్గం, అధికారులు కుమ్మక్కైయ్యారని రైతులు ఆరోపించారు. ప్రస్తుతం ఇస్తున్న ధర ప్రకారం తమకు పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని.. ఇలాగే ఉంటే తమకు చావే శరణ్యమని అంటున్నారు.

శని, ఆది, సోమ వారాల్లో మార్కెట్‌కు సెలవు దినాలు కావడంతో ఖమ్మం మార్కెట్‌లో శుక్రవారం ఒక్కరోజే 2.5లక్షల బస్తాలు వచ్చాయి. దీంతో ఈరోజు తెచ్చిన పంటనంతా ఈరోజే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ కార్యాలయాన్ని చుట్టుముట్టి రాళ్ల వర్షం కురిపించారు. మార్కెట్‌ బయట మిర్చి కొనుగోలు చేస్తున్న వ్యాపారుల కాంటాలను ధ్వంసం చేశారు. మార్కెట్‌లో ఇంత జరుగుతున్నా మార్కెట్‌ ఛైర్మన్‌, అధికారులు స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.