రాజ్యసభలో టిఆర్ఎస్ పెద్దల మౌనముద్ర

TRS Elders keeping quite in Rajya Sabha

TRS Elders keeping quite in Rajya Sabha

పెద్దల సభలో గొంతు వినిపించే సభ్యులు కరువయ్యారా? ఉంటే వారు ఎందుకు మాట్లడలేకపోతున్నారు? వారికి శక్తి, సామర్ధ్యాలు లేవా? లేకపోతే వారికి ప్రజల సమస్యలపట్ల అవగాహన లేదా? ఒకపక్క లోక్ సభలో సభ్యులు గొంతు చించుకొని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే, మరోపక్క పెద్దల సభలో కొందరు నేతలు మౌన ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. పార్లమెంటులో అడుగు పెట్టాలన తమ స్వప్నసాకరంకోసమే వారు పెద్దల సభకు వచ్చారు. కానీ ప్రజల సమస్యల పరిష్కారంకోసం పోరాడేందుకు కాదు. అసలు పెద్దల సభలో ఏం జరుగుతోంది? టిఆర్ఎస్ పెద్దలు ఢిల్లీలో చేస్తున్నది ఏమిటి? వారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు?

టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎంపిక చేసిన వారు ముగ్గురూ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అందులో కె కేశవరావు కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లోకి చేరిన మొదటి సభ్యుడు. కేకేగా పిలవబడే ఆయన తెలంగాణ రాజకీయాల్లో మేధావిగా పేరు పొందినవాడు. కానీ ఆయన తెలంగాణ ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలపట్ల ఎన్నడూ అధ్యయనం చేసి ఎరగడు. ఆయనకు కాలక్షేపం చేయడానికి కావాల్సిన స్నేహితులున్నారు. ఎంపీగా ప్రజల సమస్యలపై రాజ్యసభలో గొంతవిప్పండి అని అంటూ హైదరాబాద్ నుండి కానీ, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతం నుండి గానీ మొరపెట్టుకునే వారు లేరు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేశవ రావు కుమారుడుకి కూడా కార్పోరేషన్ పదవి కట్టబెట్టారు.

రెండవ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్. ఈయన రాజకీయాల్లో చాలా సీనీయర్ నాయకుడు. కేకే కి, డి శ్రీనివాస్ కి మధ్య కొంత వ్యత్యాసం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేకే ఒకసారి పిసిసి అధ్యక్షుడుగా ఉంటే, డిఎస్ రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. డిఎస్ కు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్ధులపై చర్చజరిగినప్పుడు ఢిల్లీలో డిఎస్ పేరు కూడా వినిపించేది.

ఆంధ్రప్రదేశ్ 2014 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి పెద్ద మెజారిటీ సాధించారు. రాజశేఖరరెడ్డి కాకుండా డిఎస్ ను ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణలో కేసీఆర్ కు అడ్డుకట్టవేయడం సాధ్యకావచ్చునని కాంగ్రెస్ అధిష్టానంలో చర్చ జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం డిఎస్ కు ఎంతో గౌరవం ఇచ్చింది. ఆయన వరుసగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు శాసన మండలి సభ్యుడిగా సముచిత స్థానం ఇచ్చింది. కానీ డిఎస్ కాంగ్రెస్ లో ఉన్నంత వరకు ఆయన జీవితాశయం నెరవేరలేదు. ఆయనకు ఢిల్లీ లో ఐదు సంవత్సరాలపాటు పార్లమెంట్ లో ఉండాలనే కోరిక ఉండేది.

కెకె, డిఎస్ వీరిద్దరు మున్నూరు కాపు, బీసీ వర్గానికి చెందిన వారు. కాంగ్రెస్ అధిష్టానం మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా చేసిన హనుమంతరావు కూడా ఆ వర్గం వాడే. కానీ డిఎస్ కు పార్లమెంటుకు వెళ్లే అవకాశం దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీనీ వీడారు. పార్లమెంటులో అడుగుపెట్టాలనే ఆయన కల నెరేవరడానికి నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవితను సంప్రదించారు. రాజ్యసభ సభ్యునిగా అవకాశ కల్పించమని కోరారు. ఇదే జరిగితే నిజామాబాద్ నియోజకవర్గంలోని మున్నూరుకాపు వర్గానికి చెందిన ఓటర్లతోపాటు తన అనుచరులు కూడా టిఆర్ఎస్ వెంట ఉంటారని కవితకు డిఎస్ హామీ ఇచ్చారు. నిజమాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. పలుకుబడి గలిగిన డిఎస్ టిఆర్ఎస్ లో చేరితే మంచి పరిణామమే అవుతుందనే ఆలోచనతో కూతురు కవిత చేసిన సూచనను కేసీఆర్ అంగీకరించారు.

ఇప్పుడు ఆయన రాజ్యసభలో జరిగే చర్చల్లో పాల్గొనడం గానీ, ప్రశ్నలు అడగడంకానీ లేదు. ప్రజల పక్షాన ఆయన పోరాటం చేయాల్సిన పనిలేదు. తన సీట్లోనుంచి లేచి ఏ సమస్యపైనా ఆయన చైర్మన్ గానీ, డిప్యూటీ చైర్మన్ గానీ అభ్యర్ధించాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యపై నిజామాబాద్ ఎంపీ కవిత లోక్ సభలో ఎంతో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకున్న ఎన్నో సమస్యలను తనదైన శైలిలో మాట్లాడుతూ లోక్ సభ ముందుకు తెస్తున్నారు. డిఎన్ కుమారుడు టిఆర్ఎస్ పార్టీతో మమేకమై అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు.

తెలంగాణ నుంచి మూడో సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంత్ రావు. ఈయన కేసీఆర్ కు పాత స్నేహితుడు. ఆయన రాజ్యసభలో సమస్యలపై మాట్లాడంగానీ, ఏదైనా సమస్యను ముందుకు తెసుకెళ్లడానికి లేచి మాట్లాడిన దాఖలాలు లేవు.  ఆయన ముఖ్యమంత్రికి నమ్మకమైన స్నేహితుడు మాత్రమే. అతను మాజీ ప్రధాని పివి నరసింహారావుకు సమీప బంధువు. రాజ్యసభ సీటుతో సత్కరించిన అరుదైన బ్రాహ్మణుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు. 2014 ఎన్నికల్లో తన కుమారుడుని టిఆర్ఎస్ అభ్యర్ధిగా నిలబెట్టి గెలిపించుకున్నారు.

కాంగ్రెస్ నుండి కెవిపి రామచంద్ర రావు, అదే విధంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుండి కొత్త అభ్యర్ధి విజయ్ సాయి రెడ్డీలు తమ ఉనికిని రాజ్యసభలో చాటిచెబుతున్నారు. కానీ తెలంగాణ సభ్యులకు మాత్రం వీటిపై పెద్దగా ఆసక్తిని కనబరచడంలేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ్యుడు ఆనంద భాస్కర్ ఇంగ్లీష్, హిందీ  భాషలలోనే రాజ్యసభలో మాట్లాడుతున్నారు. ఇటీవల ఆయన బుందేల్ఖండ్ గురించి మాట్లాడారు. ఆనందభాస్కర్ ను రాజ్యసభకు పంపడంలో ఆయన రాజకీయ గురువు డిఎస్ ముఖ్య పాత్ర వహించారు.  ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు కెవిపి, విజయ్ సాయి రెడ్డి తెలంగాణ రాష్ట్ర సభ్యులకంటే మెరుగైన పనితీరుని కనబరుస్తున్నారు. తన రాజకీయ గురువు, మిత్రుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నంత కాలం కెవిపీ తెరవెనకే ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకావాలని రాజ్యసభలో పోరాడుతున్నారు. రాజ్యసభలో ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లుపై చర్చ జరుగుతున్నంతసేపు ఆయన ఒక ప్లకార్టు పట్టుకొని నిలబడటం కనిపించింది. ప్రత్యేక హోదా కొరకు ఆయన‎ ఒక ప్రైవేటు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆయనకు పాత్రికేయులతో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన రాజ్యసభలో ప్రత్యేక హోదాపై చేస్తున్న ఒంటరి పోరాటానికి విస్తృతమైన ప్రచారం లభిస్తోంది.

టిఆర్ ఎస్ పెద్దలను రాజ్యసభలో మేల్కొని పోరాడమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు చెబుతారు? ఈ అనుభవంతోనైనా గుణపాఠం నేర్చుకొని అధ్యయన శీలం కలిగిన వారిని ప్రజాసేవ పట్ల మక్కువ ఉన్నవారిని ఇకముందు రాజ్యసభకు పంపిస్తారా?

Have something to add? Share it in the comments

Your email address will not be published.