ఈఓ తర్వాత ఛైర్మెన్ పదవిపై టార్గెట్??

TTD EO row: After EO now another North Indian to be TTD Chairman

TTD EO row: After EO now another North Indian to be TTD Chairman

  • మోడీ కోటరీ ఒత్తిళ్ళకు తలొగ్గిన చంద్రబాబు
  • ఇప్పుడు ఉత్తరాది టీటీడీ ఈఓ నెక్స్ట్ టీటీడీ ఛైర్మెన్??
  • టీటీడీని అనిల్ ద్వయం పాలిస్తుందా??

 

మోడీ కోటరీ ఒత్తిళ్ళకు తలొగ్గి ఉత్తరాది ఐఎఎస్‌ను టీటీడీ ఈఓని చేసిన చంద్రబాబుపై ఒత్తిళ్ళు మరింత పెరుగుతున్నాయి. టిటిడి బోర్డు ఏర్పడినప్పటినుండి ఇప్పటివరకు స్థానిక తెలుగు ఐఎఎస్‌లను నియమించిన సంప్రదాయిన్ని పక్కనబెట్టేలా చంద్రబాబుపై ఒత్తడి పెంచిన మోడీ కోటరీ ముందు చంద్రబాబు మరోసారి తలవంచే పరిస్థితులు ఎదురవనున్నాయనే ప్రచారం ఊపుందుకుంది.

ఈఓ నియామకం అయిపోయిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్‌గా టీటీడీ బోర్డు ఛైర్మెన్ పదవికే ఉత్తరాది కోటరీ టార్గెట్ చేసిందని, దాంతో ప్రస్తుతం ఉన్న చదలవాడ కృష్ణమూర్తి తర్వాత ప్రధాని నరేంద్రమోడీకి దగ్గరగా ఉండి, తిరుమలేషుడిపై భక్తి ఉన్న బడా వ్యాపారవేత్తను ఛైర్మెన్‌గా కూర్చోబెట్టే పనిలో పడ్డారని టాక్ నడుస్తోంది. అందులో భాగంగానే ముందుగా ఈఓగా ఉత్తరాది ఐఎఎస్‌ను కూర్చోబెట్టి ఆ తర్వాత చంద్రబాబుపై ఒత్తిడి మరింత పెంచి ఛైర్మెన్ పదవిలో సైతం ప్రస్తుతం ఉన్న ఈఓ పేరుతోనే ఉన్న ఉత్తరాది బడాబాబుని నియమించాలనే మంత్రాంగం నడుస్తోందట.

అసలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుప్రఖ్యాతులున్న ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటి తిరుపతి. ఏమూలకున్న వాళ్ళైనా తిరుపతి పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది మాత్రం అభయహస్త వెంకటేశ్వరుడే. దక్షిణాదిలో ఉన్నవారు  ముద్దుగా వెంకన్న అని పిలుచుకున్నా, ఉత్తరాదిలో ఉన్నవాళ్ళు బాలాజీ అని పిలుచుకున్నా చేసే ప్రార్థనలు మాత్రం ఆయన ఒక్కడికే. ఎంతో పవిత్రస్థలంగా హిందువులందరూ భావించే తిరుమల విషయంలో ఇప్పుడు అనవసర రాద్ధాతం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ ఈఓ నియామకం విషయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెద్ద దుమారానికే తెరలేపింది.

తెలుగు రాష్ర్టాలకు చెందిన ఐఏఎస్‌లను పక్కనపెట్టి ఉత్తరాదికి చెందిన అనిల్‌కుమార్ సింఘాల్‌ను ఈఓగా నియమించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమౌతున్నాయి. టీటీడీ బోర్డు ఏర్పడక ముందు హథీంరాంజీ నుండి తిరుమల ఆలయ బాధ్యతలు చూసే సంప్రదాయం ఉత్తరాది వాళ్ళకే అప్పగించబడింది. ఆ తర్వాత బ్రిటిష్ పాలనలో ఉత్తరాదికి చెందిన మహంతులే ఆలయ బాధ్యతలను చూసేవాళ్ళు. 1932లో టీటీడీ బోర్డు ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు ఈఓలుగా తెలుగు నేపథ్యం ఉన్న ఐఎఎస్‌లనే నియమిస్తూ వచ్చింది. ఇప్పటివరకు 24మంది తెలుగు ఐఎఎస్‌లు టిటిడిబోర్డు ఈఓలుగా బాధ్యతలు నిర్వహించారు. అయితే 25వ ఈఓగా సాంబశివరావు స్థానంలో ఉత్తరాదికి చెందిన అనిల్‌కుమార్ సింఘాల్‌ను నియమించడంతో ఉత్తరాది, దక్షిణాది అనే చర్చకు తెరలేపారు చంద్రబాబునాయుడు.

తిరుమల ఆలయానికి వచ్చే భక్తుల్లో 45 నుడి 50శాతం తమిళులు ఉండగా, 40శాతం తెలుగువారు ఉంటారు. అంతేగాక వెంకన్నను దర్శించుకొనే వాళ్ళలో ఉత్తరాది వారు 10శాతంలోపే ఉంటారు. అంతేగాక టీటీడీ పరిధిలో ప్రస్తుతం 15వేలమంది శాశ్వత ఉద్యోగులు ఉండగా, 10వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 99శాతం మంది  తెలుగువాళ్ళే ఉండడంతో ఈఓగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తికి వీళ్ళందరినీ కలుపుకొని ఆలయ అభివృద్ధికి పనిచేయాల్సి ఉంటుంది. ఇన్నేళ్ళు ఉన్న ఈఓలు తెలుగువాళ్ళే కావడంతో పైస్థాయి నుండి క్రింది స్థాయి ఉద్యోగుల వరకు ఎవరితోనైనా ఈఓ సులభంగా కలిసిపోవడానికి వీలుండేది.

అయితే టిటిడి ఈఓగా బాధ్యత స్వీకరించిన అనిల్ ‌కుమార్ సింఘాల్ ముందు అనేక సమస్యలు ఎదురుకానున్నాయి. అందులో ముఖ్యంగా టీటీడీ ఈఓగా ఉద్యోగులు, భక్తులతో మమేకమైపోవాల్సిన దగ్గర బాషాబేధం వల్ల అందరితో దాదాపు ప్రత్యక్ష సంబంధం కోల్పోవలసి వస్తుంది. అంతేగాక ఇప్పటివరకు ఈఓలుగా చేసిన ఐఎఎస్‌లకు స్థానిక పూజా విధానాలు, ఆధ్యాత్మికపై పట్టు ఉండడమే కాకుండా, వైఖానస ఆగమ ప్రకారం పూజా విధానం జరుగడంపై అవగాహన ఉంది. అయితే సింఘాల్ ఎంతమేరకు స్థానిక ఆగమ పద్ధతులను అర్థం చేసుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. అంతేగాక ప్రతీనెల టీటీడీ ప్రతిష్మాత్మకంగా నిర్వహించే డయల్ యువర్ ఈఓ వంటి కార్యక్రమానికి ఫోన్‌ చేసే వాళ్ళు ఎకకువగా తెలుగువాళ్ళే ఉండడం, అందులోనూ ఆగమానికి సంబంధించి వచ్చే ప్రశ్నలను ఎలా ఎదుర్కుంటారన్నదానిపై చర్చ జరుగుతోంది.

ఢిల్లీలో మంచి పట్టున్న అనిల్ కుమార్ సింఘాల్‌ను టీటీడీ ఈఓగా నియమించడంపై ప్రధాని మోడీ కోటరీ నుండి చంద్రబాబుపై ఒత్తిడి ఎక్కువగానే పనిచేసింది. అందుకే తెలుగు ఐఎఎస్‌ అధికారులందరూ కలిసి తమలో ఎవరో ఒకరిని ఈఓగా నియమించాలని కోరినప్పటికీ మోడీ కోటరీ ఎఫెక్ట్ గట్టిగానే పనిచేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఇన్నేళ్ళు రాజకీయాలకు అతీతంగా ఉండే పవిత్ర తిరుమలలో ఇలాంటి ఆధిపత్య రాజకీయాలకు తెరలేపిన చంద్రబాబు ప్రజల మనోభావాలు దెబ్బతీసి రేపిన చిచ్చు ఎంతవరకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.

Have something to add? Share it in the comments

Your email address will not be published.