లండన్ లో ఘనంగా ఉగాది వేడుకలు

Ugadi celebrations in grand way held in London

Ugadi celebrations in grand way held in London

లండన్: యునైటెడ్ కింగ్డమ్ తెలుగు సంఘం (యుక్త) నిర్వహించిన ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక తూర్పు లండన్ లోని బీకాన్ట్రీలో నిర్వహించిన ఈ వేడుకల్లో వెయ్యి మందికి పైగా ప్రవాస తెలుగు కుటుంబాలు పాల్గొన్నాయి.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ విద్యాభవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. నందకుమార, ప్రత్యేక అతిథిగా తెలుగు ప్రవాసులు అధికంగా నివసించే ఈస్ట్ హాం పార్లమెంట్ సభ్యుడు స్టీఫెన్ టిమ్మిన్స్ పాల్గొన్నారు. విశేష అతిథులుగా లాంబెత్ మేయర్, ప్రవాస తెలుగు మహిళ సాలేహ జాఫర్, పంజాబ్ నేషనల్ బ్యాంకు యు కె అధ్యక్షుడు నాయక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నందకుమార మాట్లాడుతూ ప్రతి ఉగాది పండుగ ఒక యుగాదికి నాంది అని, ఉక్త అంటే సరస్వతీ వాక్కు, యుక్త అంటే పవిత్రమైనదని తెలిపారు. సూర్యగమనాన్ని అనుసరించి ఋతువులు ఏర్పడటం, వాటి ద్వారా పండుగలు జరుపుకోవటం ఒక్క భారతదేశంలో మాత్రమే ఉంటుందని, అదే మన సంస్కృతికి నాంది అని తెలిపారు.

ప్రత్యేక అతిథి పార్లమెంట్ సభ్యుడు స్టీఫెన్ టిమ్మిన్స్ మాట్లాడుతూ బ్రెక్సిట్ అధ్యయన కమిటీలో తాను సభ్యుడని, భారతదేశంతో మైత్రి, సత్సంబంధాల ద్వారా మాత్రమే అనూహ్యమైన పరిణామాలను ఎదుర్కునే మనోబలాన్ని బ్రిటన్ పొందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగువారితో తనకున్న అనుబంధం విడదీయలేనిదని ఆయన పేర్కొన్నారు.

అనంతరం సంప్రదాయ రీతిలో పంచాంగ శ్రవణం, చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. హేవిళంబి నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ విభాగాల్లో ప్రతిభ చూపించిన చిన్నారులకు, అనేక రంగాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుని సామాజిక సేవకు శ్రీకారం చుట్టిన ప్రవాస తెలుగు ప్రముఖులను ఈ సందర్భంగా సత్కరించారు.  ఎయిర్ ఇండియా యు కె ప్రాంతీయ అధికారిణి శ్రీమతి తారా నాయుడు, ఇటీవల విజయవంతమైన పెళ్లిచూపులు చిత్ర నిర్మాత యష్ రంగినేని ఉగాది పురస్కారాలు పొందిన వారిలో ఉన్నారు.

తెలుగు సంఘాలను అనుసంధానం చేస్తూ పండుగల ద్వారా ఆంధ్ర, తెలంగాణా రాష్ట్ర ప్రవాసులను ఏక త్రాటి మీదకు తీసుకురావాలన్న ధ్యేయాన్ని యుక్తా ఈ ఉగాది వేడుకల ద్వారా శ్రీకారం చుడుతోందని అధ్యక్షుడు ప్రసాద్ మంత్రాల అన్నారు. తెలంగాణా ఎన్ఆర్ఐ ఫోరమ్ తో కలిసి తెలంగాణా చేనేత కార్మికుల సహాయార్ధం పోచంపల్లి, గద్వాల్ వస్త్ర శ్రేణి ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అనంతరం యుక్తా నూతన వెబ్ సైట్ ఆవిష్కరించారు.

ఆహూతులందరికీ ఉగాది పచ్చడి, కమ్మని తెలుగు భోజనం వడ్డించారు. శ్రీమతి రమ్య, సుజాత తలాడి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో యుక్తా ట్రస్టీ లు శ్రీమతి గీత మోర్ల, డా. వెంకట పద్మ కిల్లి, ఉపాధ్యక్షుడు రాజ్ కుర్బా, ప్రధాన కార్యదర్శి సత్యప్రసాద్ మద్దసాని, కోశాధికారి నరేంద్ర మున్నలూరి,  ఐటి కార్యదర్శి క్రిష్ణ యలమంచిలి, మీడియా కార్యదర్శి రుద్ర వర్మ,  ప్రజా సంబంధాల కార్యదర్శి  బలరాం విష్ణుభొట్ల, మానవ వనరుల అభివృద్ధి కార్యదర్శి ఉదయ్‌ అర్యన్‌ ఆరేటి, సాంస్కృతిక కార్యదర్శి పూర్ణిమ చల్లా, క్రీడలు కార్యదర్శి సుధీర్ కొండూరు, కృష్ణ సనపల, సమాచార మరియు ఐటి ఆదిత్యవర్దన్‌  అల్లాడి , అమరనాద్‍ రెడ్డి, కార్తిక్‌లు తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.