కోడెలపై ఉండవల్లి ధ్వజం

Undavalli criticises AP speaker Kodela Siva Prasad

Undavalli criticises AP speaker Kodela Siva Prasad

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ నడుస్తున్న తీరుపై రాష్ట్ర ప్రజానీకం ఎంతో నిరుత్సాహానికీ, ఆందోళనకూ గురవుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం నేతలు శాసనసభలో చర్చిస్తారేమో ఎదురుచూడం వరకే వారి వంతైంది. ఎప్పటిలాగానే ప్రజా సమస్యలను పరిష్కరించపోగా ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటూ అధికార పక్షం, ప్రతిపక్ష నేతలు అసెంబ్లీ సమయాన్ని వృధా చేయడంతోపాటు ప్రజా ధనం కూడా వృధా చేస్తున్నారు. దీంతో ఆరోపణలు, సవాళ్లు చేసుకోడానికే అధికార, ప్రతిపక్ష నాయకులు శాసనసభని వేదిక చేసుకున్నారనిపిస్తోంది.

దీనిపై మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ శాసనసభను నడుపుతున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సభాపతి సమాధానం చెప్పకుండా సభను నడపడం ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు ఆరోపణలను చేస్తున్నసమయంలో ఆయన మైక్ కట్ చేసి, ఎదురు ఆరోపణలు చేసినవారికే సభాపతి అవకాశం ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. సభాపతి అధికారపక్షానికి చెందివారైనప్పటికీ సభ నడిపేటప్పుడు ఇరుపక్షాలకూ ఆయన అనుసంధానకర్తగా ఉండాలన్నారు. ఆయనకు తరతమ భేదాలు ఉండకూడదని సూచించారు.

సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభా నాయకుడిగా వ్యహరించడం లేదని ఉండవల్లి ఎద్దేవా చేశారు. గత బుధవారం చంద్రబాబు సభలో లేచి తాను నీతివంతులమని ప్రమాణం చేయించడం, దానికి సభాపతి కూడా లేచి నిలబడడం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి చెబితే సభాపతి లేచి నిలబడి అందరితోపాటు ఆయన కూడా ప్రమాణం చేయడం అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్దమని ఉండవల్లి పేర్కొన్నారు. సభాపతి అధికారపక్షానికి చెందినవారైనప్పటికీ ఆ స్థానానికున్న నియమనింబంధలను పాటించాలని ఆయన పేర్కొన్నారు.

గతంలో ఎంతో మంది సభాపతులు శాసనసభను నడిపిన తీరును అనేక పుస్తకాల్లో చదివానన్నారు. అది చదివిన తర్వాత ప్రస్తుత సభాపతి శాసనసభను నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే ఎంతగా దిగజారిపోయిందో అర్ధమవుతోందన్నారు. తాను నీతిమంతుడిగా ప్రమాణం చేసిన చంద్రబాబు, ఓటుకు నోటు కేసు ఆడియో టేపుల్లోని స్వరం తనది కాదని శాసనసభలో చెప్పగలరా అని ఉండవల్లి ప్రశ్నించారు. రాజకీయాల్లో ఎవరు ఎంత నీతిమంతులో ప్రజలకు ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదని ఉండవల్లి పేర్కొన్నారు. ప్రతిరోజూ జరుగుతున్న శాసనసభా సమావేశాల్లో నాయకుల తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా సభాపతి ఏకపక్షంగా కాకుండా ఇరు పక్షాల వారికి వారధిలాగా ఉంటూ శాసనసభ సమావేశాలను నిర్వహించాలని ఉండవల్లి హితవు పలికారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.