తెదేపా, భాజపా పొత్తులూ, ఎత్తులూ, జిత్తులూ

వెంకయ్య సీమాంధ్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా, కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలో దిగాలని కార్యకర్తల ఒత్తిడి

మోదీ, చంద్రబాబునాయుడికి పరస్పర సహకారం అవసరం

హైదరాబాద్, మార్చి 26: తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య సీట్ల సర్దుబాట్లపైన బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. నరేంద్రమోదీ హవాను అంచనా వేయడంలో తేడాలు ఉండటంతోఎవరి వాదనకు వారే కట్టుబడి సమాలోచనలు ఒక కొలిక్కి రాకుండా పట్టుపడుతున్నారు.మోదీ హవా కాదనీ, అది ప్రభంజనమనీ, సునామీ సదృశమనీ మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్న భాజపా నేతల ఆశలు అంబరాన్ని తాకుతున్నాయి. తెలంగాణలో టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలంటూ ఒత్తిడి పెరగడం ఒక ఎత్తు అయితే, తాజాగా సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వెంకయ్యనాయుడు ఎందుకు బరిలో దిగకూడదంటూ వాదించడం ఒక ఎత్తు. గతంలో 1978లో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రత్యక్ష ఎన్నికలలో విజయాలు సాధించలేక పరోక్షంగా రాజ్యసభలో ప్రవేశిస్తూ వచ్చిన భాజపా వరిష్ఠనేత వెంకయ్యనాయుడు ప్రస్తుతం కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు. ఆయన రాజ్యసభ సభ్యుడుగానే వాజపేయి మంత్రిమండలిలో సభ్యుడుగా పని చేశారు. అటువంటి వెంకయ్యను మీరు మాత్రం ముఖ్యమంత్రిగా పని చేయలేరా, ఒక్క చంద్రబాబునాయుడే సమర్థుడా, మీరు కాదా అంటూ పార్టీ సహచరులు ప్రోత్సహిస్తున్నారు.

ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ ప్రచారం అంచనాలకు మించిన ఫలితాలు ఇస్తున్నది. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో చాలా మంది నాయకుడు మోదీకి నిరాజనం పడుతున్నారు. చంద్రబాబునాయుడితో సత్సంబంధాలు లేనివారూ, ఆయన ప్రత్యర్థులూ నరేంద్రమోదీతో ప్రత్యామ్నాయం గురించి చర్చిస్తున్నారు.

తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కృష్ణయ్యను ముందుపెట్టుకొని ఎన్నికల ప్రచారంలో ముందుకు పోవాలని ఆలోచించిన చంద్రబాబునాయుడికి సీమాంధ్రలో చాపకింద నీరులాగా ప్రత్యర్థుల ప్రభావం విస్తరిస్తున్నది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో జనసేన పార్టీ నెలకొల్పిన తర్వాత నేరుగా ఢిల్లీకీ, అక్కడినుంచి అహ్మదాబాద్ కూ వెళ్ళడం, నరేంద్రమోదీని కలవడం నాటకీయంగా జరిగిన పరిణామాలు. ఈ వ్యూహం వెనుక చంద్రబాబునాయుడు ఉన్నారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కాపు సమాజిక వర్గాన్ని కాంగ్రెస్ నుంచి దూరం చేసి తెలుగుదేశం పార్టీకి చేరువ చేయడానికి పవన్ ను పావుగా వినియోగించుకోవాలని అభినవ చాణక్యుడు చంద్రబాబునాయుడు ఎత్తుగడ వేసినట్టు పత్రికలలో, టీవీ చానళ్ళలో కథనాలు వచ్చాయి. పవన్ తర్వాత అహ్మదాబాద్ కు మరో తెలుగు తెర కథానాయకుడు అక్కినేన నాగార్జున వెళ్ళి వచ్చారు. ఆయన కూడా నరేంద్రమోదీకి మద్దతు ప్రకటించడంతో పాటు భార్య అమలకు విజయవాడ లోక్ సభ టిక్కెట్టు ఇవ్వాలంటూ సూచించనట్టు సమాచారం. ఆ ఊహాగానాలను నాగార్జున ఖండించినప్పటికీ ప్రజలలో ఆ అభిప్రాయం తొలగిపోలేదు. ఇప్పుడు తాజాగా మరో నటుడూ, వయస్సు మళ్ళిన హీరో మోహన్ బాబుకూడా అహ్మదాబాద్ బాట పట్టారు. వీరంతా చంద్రబాబునాయుడితో సఖ్యత లేనివారు కావడం గమనార్హం.

ఈ లోగా భాజపా, తెదేపా మధ్య ఎన్నికల  ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలు ముందుకు సాగడం లేదు. రెండు పార్టీలూ తమ ప్రాబల్యాన్ని ఎక్కువగా అంచనావేసుకోవడం, నాయుడు భజపాకు చాలా తక్కువ సీట్లు ఇవ్వజూపడం, భాజపా నేతలు చాలా ఎక్కువ సీట్లు ఆశించడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. భాజపా ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ జావ్ దేకర్ కొన్ని రోజులుగా హైదరాబాద్ లో మకాం వేసినప్పటికీ చర్చలలో పురొగతి లేకపోయింది. చివరికి మోదీకి సన్నిహితుడైన అరుణ్ జైట్లీ హైదరాబాద్ కు రానున్నారు.

ఆర్ ఎస్ ఎస్ నాయకత్వం కూడా తెదేపా ఆధిపత్యాన్నీ, చంద్రబాబునాయుడు పెత్తనాన్నీ, వెంకయ్యనాయుడి మెతక వైఖరినీ నిరసిస్తున్నది. ఆంద్రప్రదేశ్ లో భాజపా ఎదుగదల లేకుండా కురచగానే కునారిల్లుతూ ఉండటానికి వెంకయ్యనాయుడే కారణమనీ, ఆయనకు భాజపా ప్రయోజనాలకంటే కమ్మ సామాజిక వర్గం ప్రయోజనాలే ప్రధానమని ఆర్ ఎస్ ఎస్ అగ్రనాయకులు కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ కారణంగానే సీమాంధ్రలో అభ్యర్థుల ఎంపికలో కూడా ఆర్ ఎస్ ఎస్ నాయకులు ఇదివరకటి కంటే ఎక్కువ ఆసక్తి, చొరవ ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో, సీమాంధ్రలో కూడా భాజపా ఒంటరిగా పోరాటం చేయవచ్చుననీ, తెలంగాణలో కిషన్ రెడ్డినీ, సీమాంధ్రలో వెంకయ్యనాయుడినీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటించాలనీ వారు వాదిస్తున్నారు. చంద్రబాబునాయుడితో సీమాంధ్రప్రజలు విసిగిపోయారనీ, వెంకయ్యను ప్రత్యామ్నాయంగా ప్రకటిస్తే ప్రజలు సానుకూలంగా స్పందిస్తారనీ వారి అభిప్రాయం. అదే విధంగా తెలంగాణ లో చాలాకాలంగా బీసీల హక్కుల కోసం పోరాడుతున్న కృష్ణయ్యకు ఎటువంటి ఆకర్షణశక్తీ లేదనీ, ఆయన కంటే కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి యోగ్యుడనీ అంటున్నారు.

సీమాంధ్రలో పురంద్రేశ్వరీ, కావూరి సాంబశివరావు. పవన్ కల్యాణ్, నాగార్జున, మోహన్ బాబు, కృష్ణంరాజు వంటి జనాకర్షణ కలిగిన వ్యక్తుల అండదండలతో, మోదీ సమ్మోహనాస్త్రంతో భాజపా అసెంబ్లీ స్థానాలనూ, లోక్ సభ స్థానాలనూ గెలుచుకోగలదనీ ఆర్ ఎస్ ఎస్ నేతల విశ్వాసం. తెలంగాణలో బలం తక్కువగా ఉన్నదని భావించే పక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితితో ఒప్పందం చేసుకోవచ్చునని వారు అంటున్నారు. తెదేపాతో పెట్టుకుంటే భాజపాకి భవిష్యత్తు ఉండదనీ, తక్కవ స్థానాలలో పోటీ చేయవలసి వస్తుందనీ, పార్టీ ప్రాబల్యం  ఆ నియోజకవర్గాలకే పరిమితం అవుతుందనీ, తెదేపా పోటీ చేసే నియోజకవర్గాలలో భాజపాకు పుట్టగతులు ఉండవనీ, పార్టీ నిర్మాణం సాగదనీ వారు వాదిస్తున్నారు. ఈ వాదనలోని బలం భాజపా కేంద్రనాయకులను పునరాలోచనలో పడవేస్తున్నది.

అయితే, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే భాజపా నాయకత్వంలోని ఎన్ డీ ఏ కూటమికి 272 స్థానాలు లోక్ సభలో అవసరం. ఎంత మోదీ ప్రభంజనం ఉన్నప్పటికీ భాజపాకి 200 సీట్లకంటే అధికంగా వచ్చే వాతావరణం కనిపించడం లేదు. తెదేపాతో మంచి సంబంధాలు పెట్టుకుంటే తెదేపా తెచ్చే స్థానాలతో పాటు చంద్రబాబునాయుడు దేశంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న చిన్నా చితకా పార్టీలను మళ్ళించుకొని రాగలడనీ, కొత్త భాగస్వామ్య పక్షాలకు ఎన్ డీఏలోకి నడిపించగలరనీ భాజపా జాతీయ నాయకుల నమ్మకం. ఈ కారణంగానే వారు తెదేపాతో ఒప్పందం ఏదో విధంగా కుదుర్చుకోవాలని పట్టుదలగా ఉన్నారు. తెలంగాణ, సీమాంధ్రలో విజయాలు సాధించేందుకు చంద్రబాబునాయుడికి నరేంద్రమోదీ సానుకూల పవనాలు అవసరం. కేంద్రంలో అధికారం సాధించేందుకు మోదీకీ చంద్రబాబునాయుడి రాజకీయ చాకచక్యం అవసరం. అందుకే ఆర్ ఎస్ ఎస్ అభీష్టాన్ని కూడా కాదని తెదేపాతో భాజపా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ రకంగా తెలుగునాట వేళ్ళూనుకునే మరో అవకాశాన్ని భాజపా చేజార్చుకోవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

– వివేక్

Have something to add? Share it in the comments

Your email address will not be published.