ఓంపురి ఇక లేరు

బాలీవుడ్ నటుడు ఓం పురి ఇకలేరు. 66 ఏళ్ళ నట దిగ్గజం ఈ తెల్లవారుఝామున గుండెపోటుతో మరణించారు. చాలా కాలంగా అనారోగ్యంతో వున్న ఆయన గుండె పోటుతో స్వగృహంలోనే తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విని యావత్ సినీ ప్రపంచం దిగ్బ్రాంతికి గురైంది. ఓం పురి మృతికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

ఓంపురి హర్యానాలోని అంబాలా ప్రాంతంలో పంజాబీ కుటుంబంలో అక్టోబర్‌ 18, 1950లో జన్మించారు. పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ ఇండియాలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.1976లో మరాఠీ చిత్రం ‘ఘాశీరామ్‌ కొత్వాల్‌’తో సినీరంగ ప్రవేశం చేశారు. 1982లో ‘అరోహణ్‌’, 1984లో ‘అర్ధ్‌ సత్య’ చిత్రాలకు గానుఆయన జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ పురస్కారం పొందారు.

బాలీవుడ్ లో విలక్షణమైన గొంతుతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసిన 66 ఏళ్ల ఓం పురి భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు. హిందీ సినిమాలతో పాపులర్‌ అయిన ఓం.. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ చిత్రాల్లోనూ నటించారు. పాకిస్తాని హాలివుడ్ సినిమాల్లోనూ నటించిన బాలీవుడ్ నటుడిగా ఓంపురీకి ఘనత వుంది.ఆయన  లేకపోవటం భారతీయ సినిమాకు తీరనిలోటు.

బాలీవుడ్‌లో ఓంపురిని అభిమానించని వారంటూ ఉండరు. ఒక్క బాలీవుడ్‌ ఏంటి… భారతదేశం గర్వించదగ్గ నటుడు ఓంపురి. అందుకే ఆయన్ను ఎన్నో అవార్డులు.. రివార్డులిచ్చి సత్కరించారు. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఓంపురి అభిమానులుండే ఉంటారు. అలాంటి నటుడికి అమెరికాలోని న్యూయార్క్ మ్యూజియం అతని నటనకు ప్రాధాన్యం ఇచ్చి సత్కరించిందంటే ఆయన పేరు ఎంత వరకు వ్యాపించిందో అర్ధం చేసుకోవచ్చు.

ఓం పురి తెలుగులోనూ నటించారు. రేవతి ప్రధాన పాత్రలో చేసిన అంకురం సినిమాలో ఆయన నటన అద్భుతం. గత సంవత్సరం వచ్చిన ‘జంగిల్ బుక్’ సినిమా హిందీ వెర్షన్ లో ‘భగీర’ పాత్రకు గాత్రదానం చేశారు. దాదాపు భారతీయ భాషలన్నీటిలో నటించిన ఆయన అందరికి ఆప్తుడు. ఆయన మరణం సినీలోకానికి తీరని లోటు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.