వివాదాల మధ్య పసుపు పండుగకు రెఢీ

Vizag is ready for 3 days TDP Mahanadu happening in Andhra University campus

Vizag is ready for 3 days TDP Mahanadu happening in Andhra University campus

పసుపు పండుగకు సాగర తీరం ముస్తాబయ్యింది. విశాఖపట్నంలోని ఏయూ మైదానంలో మూడు రోజుల పాటూ జరిగే మహానాడుకు సర్వం సిద్ధమైంది. మే 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటూ జరుగనున్న మహానాడు కార్యక్రమానికి టీడీపీ ప్రతినిధులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే మహానాడు వేదిక విషయమై వివాదం మరింత పెరిగింది. ఆంధ్రాయూనివర్సిటీలో టీడీపీ మహానాడు నిర్వహించడంపై రీసెర్చ్‌ స్కాలర్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ జరిపిన కోర్టు ఈరోజు మద్యాహ్నం తీర్పు ఇచ్చింది. రీసెర్చ్ స్కాలర్ వేసిన పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు మహానాడు నిర్వహణకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు.

మరోవైపు విద్యాసంస్థల్లో రాజకీయ సభలు నిర్వహించొద్దని గతంలో ఆదేశాలున్నా తెలుగుదేశం పార్టీ ఈ ఆదేశాలను పట్టించుకోకుండా మహానాడు ఏర్పాట్లు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఏయూ దెయ్యాల కొంప అంటూ టీడీపీ ఎమ్మెల్సీ, గీతం విశ్వవిద్యాలయం అధినేత ఎంవీవీఎస్‌ మూర్తి చేసిన వ్యాఖ్యలపై విద్యార్థి, అధ్యాపక, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర, రాజకీయవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఎమ్మెల్సీ మూర్తి క్షమాపణ చెప్పని పక్షంలో మహానాడుని అడ్డుకుంటామని విద్యార్థులు ఇప్పటికే హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ప్రతిపక్షనేత హోదాలో చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర ముగింపు సభను ప్రస్తుతం మహానాడుకు తీసుకున్న ప్రాంగణంలోనే జరిపారు. దీంతో ఆ సభ తర్వాత కొద్ది రోజుల్లోనే చంద్రబాబు అధికారంలోకి రావడంతో సెంటిమెంట్‌గా రెండేళ్ళలో ఎన్నికలు వస్తున్న పరిస్థితుల్లో కావాలనే 15 ఏళ్ళ తర్వాత విశాఖపట్నంలో జరుగుతున్న మహానాడుకు అదే ప్రాంతాన్ని వేదికగా నిర్ణయించారు.

అయితే టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల కార్యకలాపాలు, మతపరమైన కార్యక్రమాలకు విద్యా సంస్థలకు చెందిన ప్రాంగణాల్లో అనుమతించకూడదని నిర్ణయించారు. ఆ నిర్ణయంతో రెండుళ్లుగా అనుమతి అడిగిన కొంతమందికి నిరాకరించారు. టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ చేపట్టిన జై ఆంధ్రప్రదేశ్ సభ, యువభేరి సమావేశాల నిర్వహణకు ఈ నిబంధనను చూపి అనుమతి ఇవ్వలేదు. అంతేగాక ఈమధ్య హిందూ ప్రచార సంస్థ ఒకటి సమావేశం నిర్వహణకు ముందుగా అనుమతి ఇచ్చి, వారి అద్దె కూడా వసూలు చేసి చివరి నిముషంలో కుదరదని అంటూ నిరాకరించారు . ఇప్పుడు ఆ నిబంధనే టిడిపి మహానాడు నిర్వహణపై విమర్శలకు మూలమైంది.

ఇంత వివాదం జరుగుతున్నప్పటికీ మహానాడుకి హాజరయ్యే ముప్పై వేల మందికి సరిపోయేలా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేసారి ఏడువేల మంది భోజనం చేయడానికి వీలయ్యే ఏర్పాటు పూర్తయింది. ఇందులో 18 రకాల వంటలను వండి వడ్డించనున్నారు. భోజన ఏర్పాట్లను మంత్రి అయ్యన్నపాత్రుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే భోజన సరంజామా అంతా మహానాడు ప్రాంగణానికి వచ్చేసింది. అంతేగాక ఎన్టీరామారావు పార్టీని నిలబెట్టే క్రమంలో చేసిన రథయాత్ర ఫోటోలు, వివిధ సందర్భాల్లో తీసిన ఫోటోలను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తప్పెట గుళ్లు, పులి వేషాలు, థింసా నృత్యం, కోలాటం, బిందెల నృత్యం, పోతురాజులు, బతుకమ్మ ఇవన్నీ మహానాడుకు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.

మహానాడుకు వచ్చే నాయకులు, కార్యకర్తలకు సదుపాయాలు కల్పించే పనిలో పార్టీ యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటి వరకూ ఆవరణలోని వేదిక, స్టాళ్లు, కార్యాలయాలు, భోజనశాలల నిర్మాణం పూర్తి చేశారు. వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించేలా ఎక్కడికక్కడ ఫ్యాన్‌లను ఏర్పాటుచేశారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులను బందోబస్తు కోసం కేటాయించారు. అంతేగాక ఏయూ మైదానమంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ లు, డాగ్ స్క్వాడ్ లు, మెటల్ డిటెక్టర్లు అన్నీ రంగంలోకి దిగాయి. ఏయూ పరిసరాలన్నీ పచ్చతోరణాలతో నిండిపోయాయి.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.