పది బిలియన్ల డాలర్ల నష్టంతో “వెస్టింగ్ హౌస్” కుదేలు!!

Westinghouse Bankruptcy Deals a Blow to Kovvada's Nuclear plant

Westinghouse Bankruptcy Deals a Blow to Kovvada's Nuclear plant

కొవ్వాడ  బతుకు జీవుడా!

ఏనుగుల గుంపు వఛ్చి దోమ గొంతులో దూరింది ఆనాడు విరాట రాజు కొలువులో పాండవులు వఛ్చి చేరితే. అలాంటి  ప్రమాదకర అణుపరిశ్రమలు, చిన్న పల్లె  సీమ అయిన కొవ్వాడ లో ఏర్పాటు చేయాలి అన్నది అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం నూక్లియార్ పవర్  కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  లిమిటెడ్ సంస్థ ద్వారా, ఇటీవలే  వందలు  ఎకరాలు ఈ పేరిట భూసేకరణ చేసి, దానికై  దాదాపు అయిదు వందల కోట్లు  రైతులకు  పరిహారంగా ఇచ్చెందుకు  అన్ని ఏర్పాట్లు చేశామని శ్రీకాకుళం కలెక్టర్ ఒక వేపు, యెన్. ఫై.సి.ఐ.ఎల్. అధికారులు ఊదర గొట్టారు. కొంత భూములు తీసుకునే చోట,  వామ పక్ష  రాజకీయ పార్టీలు కొంత  ఆందోళన చేశాయి కూడా.

భారత దేశంలో ఉత్పత్తి చేసే విద్యుత్ శక్తి లో  కేవలం  నాలుగు శాతం మాత్రమే  ఇప్పటివరకూ మనం  అణు రియాక్టర్ల ద్వారా  పొందుతున్నాము. మిగతా  విద్యుత్ మనకు బొగ్గు ద్వారా, ధర్మో ఎలెక్ట్రిక్ గా వస్తోంది. అంటే కాక మనం నీటి ద్వారా పొందదగిన   జల విద్యుత్ ను ఈ దేశంలో ఉన్నా  అపారమైన  జల వనరులను  సక్రమంగా ఉపయోగించే తీరు స్థిర పరచుకోక,  బొగ్గు  ద్వారా విద్యుత్ పై అధికంగా ఆధార పడ్డాము. ఇది మనం సత్వరమే  సవరించుకోవాలి.

ఇక ప్రపంచంలో ఎన్నో దేశాల్లో చైనాలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో, అణు  రియాక్టర్లు, పవర్ ప్లాంట్లు నడుపుతూ  అణు విద్యుత్, అణు శక్తి తప్ప, ప్రపంచంలో ఇంకేదీ ప్రత్యామ్నాయం కాదు కాదు అని చెప్పే, నిపుణులూ,  సాంకేతిక  ఇంజనీర్లు,  అణు లాబీ ప్రచారకర్తలు, ఇప్పుడు ఈ పరిణామంతో  వారికి గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది. అంత లాభదాయకమూ, పర్యావరణానికి    క్షేమ కారకము అయితే దాదాపు  నలభై రియాక్టర్లు నిర్మిస్తాము అంటూ  ముందుకొచ్చ్చిన ఈ  వెస్టింగ్హౌస్, ఇప్పుడు ఎలా దాదాపు పది బిలియన్ల  నష్టంలో,  “బేంక్ రప్ట్” అయ్యాము అని  పిటిషన్ అమెరికాలో  ఫైల్  చేసిందో ఎవరికీ  అంతు బట్టడం లేదు.

అంటే ఈ అణు  రియాక్టర్లు, పరిశ్రమ అటు క్షేమ కారకము ఎలాగూ కాదు, కానీ ఇప్పుడు ఈ తీరు చూస్తే, ఆర్థికంగా కూడా లాభదాయకం కాదు అని ఈ తాజా పరిణామాలు తెలుపుతున్నాయి.  అందువలన భారత దేశం,  న్యూక్లియర్ పీఛేముడ్  విధానం  ఫ్రాన్స్ వంటి దేశాల వలే  చురుకుగా అమలు  చేయాలి, వేల  కోట్లు, ఈ  నష్టదాయకమైన, పరిశ్రమ ఏర్పాటు పై  పెట్టుబడులు గా  మురిగిపోవడం కన్నా, ఆ నిధుల తో జల విద్యుత్  ఉత్పత్తి, అలాగే,  సౌర విద్యుత్ వాటా     పెంచడం  భారత  ప్రభుత్వం  చేయవలసి ఉన్నది.

అడుగు పెట్టగానే పిడుగు ఆడింది అన్న చందాన, ఈ  అణు విద్యుత్ పరిశ్రమ మాకు వద్దంటే వద్దని గుజరాత్ లోని మిటివర్దీ  ప్రాంత ప్రజలు, తిరస్కరించి, ఏకంగా, అమెరికా అధ్యక్షుడికి, భారత ప్రధాన మంత్రికి  లేఖ రాశారు. గ్రామ  సభల్లో,  వీటికి అనుమతులు నిరాకరించారు.  ఆ వెస్టింగ్ హౌస్, ఎట్టకేలకు, మన కొవ్వాడకు  చేరింది.  తొమ్మిది వేల తొమ్మిది వంద మెగా వాట్ల  రియాక్టర్ల పరిశ్రమ కాస్తా  పూర్వం ఉన్న ఇంకో కంపెనీ   అదీ జపాన్ కు చెందిన ఇంకో కంపెనీ  వారిదే. వారు మానుకోగా,  చివరికి  ఈ వెస్టింగ్ హౌస్ కంపెనీ   ఆరు   వేల  మెగావాట్ల రియాక్టరులు, ఆరు ఇక్కడ  వీరు పెట్టబోతున్నారు అని ప్రకటనలు వచ్చ్చాయి.

ఇంకా ఆంధ్ర ప్రదేశ్ లో వేరే వేరే  చోట్ల ఆరు అణు కుంపట్లు పెడతాము అని కూడా రాష్ట్ర ప్రభుత్వం  గత వత్సరం ప్రకటించింది.  ఇవన్నీ చాలా  ప్రమాదకర సూచనలు.  ఇవన్నీ ఇంకా ముందుకు ఎలా వెళ్లి ఉండేవో కానీ, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా,  ఈ అణు పవర్ ప్లాంట్లు, రియాక్టర్లు ఏర్పాటు, కొన్ని బిలియన్ల డాలర్ల పరిశ్రమ , భవిష్యత్ ఆందోళనలో  పడ్డది. ఇప్పటికైనా,  భారత దేశం,  ఈ మహమ్మారి ద్వారా, నిత్యావసరమైన  విద్యుత్  ఉత్పత్తి గురించి, వేల కోట్లు  వృధా మానుకుని ఆ నిధులను ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలకు మల్లించాలని, ఈ పరిణామం చెప్తున్నది. అంతర్జాతీయ అణు విద్యుత్ రంగం   చెప్తున్న ఈ పాఠం, మన పాలకులకు వివేకం  కలిగించాలి.

ఈ వెస్టింగ్ హౌస్  కాకపొతే, మరొక కంపెనీ అంటూ ఎక్కడా పనిలో పరీక్షింప బడని  “ఏ  పి 1000”  రియాక్టర్లో, ఇంకో  రియాక్టర్లో,   తెఛ్చి పెట్టి, వాటి  ద్వారా  చౌక  విద్యుత్ అనే ప్రచారాలకు స్వస్తి చెప్పి, వేరే పద్ధతుల్లో, గ్రామీణ యువతకి ఉద్యోగాలు లభ్యమయ్యేలా, ఈ విద్యుత్ ఉత్పత్తి, కొత్త ఆలోచనలతో, భారత ప్రభుత్వం  మొదలు పెట్టాలి.

గత  అరవై ఏళ్లుగా  అణు విద్యుత్ పేరిట ప్రపంచం  వేస్తున్న అడుగులు ఎంత ప్రమాదకరమో, ఎరిగి,  దేశాన్ని  ఈ  శాశ్వత  పర్యావరణ హానికర,  సర్వదా ఆర్ధిక నష్టదాయక  విద్యుత్ నమూనా నుంచి బయటకు తీసులు రావడం,  మనం ఎన్నుకున్న ప్రభుత్వాలకు, ప్రజల పట్ల  గల  మౌలిక కర్తవ్యం. ప్రధాన బాధ్యత.  ఈ పేరిట సేకరించిన రైతుల భూములను  కూడా ప్రజలకు  వాపసు చేయడం, వెంటనే మొదలు  కావాలి . దేశం “నూక్లియార్ పీఛేముడ్” విధానానికి  దారులు తీసేలా, ఈ  వెస్టింగ్  హౌస్  కుప్పకూలిన తీరు మనకు కనువిప్పు కావాలి.

-రామతీర్థ

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.