కేసీఆర్ అంటే చంద్రబాబుకి భయమా??

Why Chandrababu silent on KCR in Telangana TDP Mahanadu

Why Chandrababu silent on KCR in Telangana TDP Mahanadu

మహానాడు తన ప్రాభవాన్ని కోల్పోయింది. కార్యకర్తల్లో సమరోత్సాహాన్ని నింపి రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ప్రసంగించాల్సిన నాయకులు సైలెంట్‌గా ఉండిపోవడంతో కార్తకర్తల్లో ఉన్న ఉత్సాహం కాస్తా నీరుగారిపోయింది. ప్రస్తుతం తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ప్రతిపక్షానికి సంబంధించిన సభ అనగానే కార్యకర్తల్లో ఉండే అంచనాలను తారుమారు చేస్తూ ఏదో తూతూ మంత్రంగా సభను నిర్వహించి చేతులు దులుపుకుంది తెలంగాణా టీడీపీ. ఎప్పుడూ మాట్లాడే రేవంత్ కాస్త ఘాటుగా ప్రభుత్వంపై విమర్శలు చేశాడు అది కూడా కేసీఆర్ వల్ల జైలుకి వెళ్ళి వచ్చిన కోపంతోనే.

పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో మహానాడుకి వచ్చిన చంద్రబాబు అయినా కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటుగా మాట్లాడి కార్యకర్తల్లో జోష్ నింపుతాడనుకుంటే అది కూడా లేకుండా పోయింది. అసలు చంద్రబాబు నోటి నుండి ఒక్కసారంటే ఒక్కసారి కూడా కేసీఆర్ అని రాకపోవడంతో రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు నీరుగారిపోయారు. కేసీఆర్ అంటే ఆమాత్రం భయం ఉండాల్సిందే. ఎందుకంటే ఓటుకి నోటు కేసులో కేసీఆర్‌తో సెటిల్మెంట్ చేసుకొని అమరావతికి వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ విషయంలో కాస్త నెమ్మదించిన చంద్రబాబు ఆ తర్వాత మరీ తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్‌కు కోపం తెప్పించే విధంగా ఏవైనా వ్యాఖ్యలు చేస్తే లేనిపోని తలనొప్పిని మళ్ళీ తెచ్చుకున్నట్లు అవుతుందని చంద్రబాబు ఫీల్ అవుతున్నట్లున్నారు. అందుకే మహానాడులో సైలెంట్ అయిపోయారు.

అయితే తెలంగాణా టీడీపీలో బలాన్ని నింపాల్సిన సభలో కేసీఆర్ గురించి మాట్లాడకపోయినా టిఆర్‌ఎస్ ప్రభుత్వం గురించైనా మాట్లాడితే కార్యకర్తల్లో కొంచమైనా ఉత్తేజం నిండేది. అదేదీ కాదన్నట్లుగా ఎప్పుడూ చెప్పే నేనే హైదరాబాదుని డెవలప్ చేశాను..ఐటీ అంటేనే నేను అని చెప్పే సోది కబుర్లకు తోడు కార్యకర్తలే నా భరోసా అని చెప్పుకున్నాడే తప్ప కార్యకర్తలకు నేను మీ వెంటే ఉంటాను, వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నం చేద్దమానే సంకేతాలు ఇవ్వకపోగా తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడేవరకూ పోరాడతామని డబ్బా కొట్టుకున్నారు.

అసలు టిడిపి మహానాడు గండిపేటలో జరుగుతుందంటే …. దాని హంగామా, ఆ స్థాయి, ఆ వైభవమే వేరు. కానీ ఇప్పుడు మహానాడుని రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో జరుపుకుంటుండడం, తెలంగాణాలో ఒకప్పుడు బలంగా ఉన్న టీడీపీ ఇప్పుడు కళావిహీనంగా తయారవడంతో మహానాడుకు ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. అందులోనూ ఓటుకు నోటు వ్యవహారం తర్వాత తెలంగాణాలో టీడీపీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఇలాంటి సమయంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో రాజకీయ చైతన్యం తెచ్చింది తెలుగుదేశం పార్టీయేనని  టీడీపీ వచ్చాకే తెలంగాణలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలు. నా కుటుంబం కంటే కూడా కార్యకర్తలకే ఎక్కువగా రుణపడి ఉన్నా. పార్టీకోసం కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేశారని చంద్రబాబు ప్రశంసించారు.

పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత టీడీపీదేనని అన్నారు. తెలంగాణలో ప్రతీ కార్యకర్త కొదమ సింహాల్లా దూసుకెళ్తున్నారని అన్నారు. ఎన్టీఆర్‌ పెట్టిన ముహుర్త బలం వల్ల మనం ఎవ్వరికీ భయపడటంలేదని, తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడేవరకూ పోరాడతామని చంద్రబాబు తెలిపారు. అంతేగాక ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను టిడిపి ప్రవేశపెట్టింది. అన్ని ప్రాంతీయ పార్టీలను ఒక వేదికపైకి తెచ్చింది కూడా టిడిపినే. ఆనాడు పార్లమెంట్‌లో ప్రతిపక్ష పాత్ర పోషించిన ప్రాంతీయ పార్టీ టిడిపి అని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు.

ఒకవైపు తెలంగాణాలో పర్యటిస్తున్న అమిత్‌షా గత రెండు రోజులుగా తెలంగాణా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని ఘాటుగా మాట్లాడుతున్న పరిస్థితుల్లో మహానాడు చంద్రబాబు సైతం కేసీఆర్‌పై విమర్శలు చేస్తారని కార్యకర్తలు అందరూ ఆశించారు. అయితే కేసీఆర్‌పై ఒక్క కామెంట్ కూడా చేయకుండా చంద్రబాబు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని సంబరపడడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నీరుగారిపోయింది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.