జస్టిస్ కట్జూ ‘జర జాగ్రత్త’

Will you arrest Justice Markandeya Katju for posting in social Media

Will you arrest Justice Markandeya Katju for posting in social Media

సోషల్ మీడియా వార్ ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను విమర్శిస్తూ వస్తున్న పోస్టులపై సీరియస్ అయిన ప్రభుత్వం ఇప్పటికే పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండేయ కట్జూ కస్సుమన్నారు. పొలిటికల్‌ పంచ్‌ అడ్మిన్‌ రవికిరణ్‌ అరెస్ట్‌ను కట్జూ తీవ్రంగా ఖండించారు. సోషల్‌ మీడియా స్వచ్ఛంద కార్యకర్తల అరెస్ట్‌ రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన ట్విట్టర్‌ అకౌంట్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కార్టూన్లు అనేవి భావ స్వేచ్ఛ ప్రకటనలో ఓ భాగమని కట్జూ  అన్నారు.

అంతేగాక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పౌరులకు ఉందన్న కట్జూ ఆర్టికల్‌ 19 (1) ఏ కింద ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అన్నారు. ప్రజాస్వామ్య విధానంలో రాజకీయనాయకులను విమర్శించే హక్కు ప్రజలకు ఉందని, ఇక్కడ ప్రజలే ప్రభువులని కట్జూ స్పష్టంచేశారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం తీరు అనాగరికం, అప్రజాస్వామికమని, ఏపీ ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు సర్కార్‌పై ఆర్టికల్‌ 356 ప్రయోగించాలని అని కట్జూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ఆయన లేఖ రాశారు.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా సోషల్ మీడియాలో కట్జూ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. తనను ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ శిక్షించాలనే ధోరణితో ఏపీ సీఎం చంద్రబాబు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని, చంద్రబాబు నియంతృత్వ పాలనపై  సోషల్‌ మీడియా ద్వారా లేఖ రాసినందున ఏపీ పోలీసులను అమెరికాకు పంపించి జస్టిస్ కట్జూని అరెస్టు చేయించేలా ఉన్నారని ఎద్దేవా చేశారు ఆర్కె. అంతేగాక ప్రభుత్వం వాగ్దానాలను మరచిపోయిందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంటే చంద్రబాబుకు వణుకు పుడుతోందని విమర్శించారు ఆర్కె. కట్జూ లేఖ, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ లేఖ, చంద్రబాబు అవినీతిపై ప్రచురించిన ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌ వంటి అంశాల ఆధారంగా రాష్ట్రపతి, ప్రధానిలు కనుక 356 అధికరణ ప్రకారం చర్యలు తీసుకుందామనే ఆలోచనకు వస్తే బాబు వారినీ అరెస్టు చేయిస్తారేమోనని భయంగా ఉందని ఎద్దేవా చేశారు..

మరోవైపు ఇంత జరుగుతున్నా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు, ఇంత రాద్ధాతంతం జరుగుతున్న సమయంలో సోషల్‌ మీడియాకు సెన్సార్‌ ఉండాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెడితే కచ్చితంగా చర్యలుంటాయని స్పష్టం చేశారు చినరాజప్ప.

మొత్తానికి పొలిటికల్ పంచ్ రవికిరణ్ అరెస్ట్‌తో మొదలైన గాలిదుమారానికి కట్జూ లేఖ తోడవడంతో అదికాస్తా పెద్దదై జాతీయస్థాయి ప్రచారాన్ని పొందింది. ఇక రాబోయే రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం సోషల్ మీడియాలో సటైర్లు వేసే వారితో ఎలా వ్యవహరిస్తుందో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కట్జూని కూడా జాగ్రత్తగా ఉండాలని అందరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవసరమైతే ఎపి పోలీసులు అమెరికాకు వెళ్ళి కట్జూని అరెస్ట్ చేస్తారని సెటైర్లు వేస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.