తుందుర్రు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం

women protest against aqua food park in tundurru

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, భీమవరం మండలాల సమీపంలోని తుందుర్రు గ్రామంలో నిర్మాణం చేపడుతున్న ఆక్వా ఫుడ్ పార్కు రోజు రోజుకూ వివాస్పదమవుతుంది. ఆక్వా ఫుడ్ పార్కును వ్యతిరేకిస్తూ సుమారు 30 గ్రామాలు బుధవారం ఆందోళన బాట పట్టాయి. దీంతో తుందుర్రు చుట్టుపక్కల గ్రామాల్లో భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్వాఫుడ్ పార్క్ నిర్మాణం జరిగితే ఫ్యాక్టరీ నుంచి విష రసాయనాలు వచ్చి పంట కాలువలు, పంట పొలాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఫుడ్ పార్కును ఊరిమధ్య నుంచి దూరంగా తొలగించాలని గ్రామస్తులు పట్టుబడటంతో గత కొద్ద కాలంగా ఆ ప్రాతంలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఆక్వాఫుడ్‌ పార్క్ బాధిత మహిళలు బుధవారం తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అడుగడునా అడ్డంకులు సృష్టించడంతో తుందుర్రు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామస్తులతోపాటు ప్రజాసంఘాలు, సీపీఐ, సీపీఎం, వైసీపీ, పార్టీలు మద్దతు తెలిపాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరగడంతో తుందుర్రులో ఉద్రిక్త పరిస్థతులు నెలకొన్నాయి. తుందుర్రు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ పోలీసులు విధించారు. సుమారు 1200 మంది పోలీసులను ఫ్యాక్టరీ ప్రాంతంలో మోహరించారు. ఇప్పటికే సమారు 200 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆక్వా పార్క్‌ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులను పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేశారు. తుందుర్రు ఆక్వాఫుడ్‌ పార్క్ కమిటీ నాయకురాలు ఆరేటి సత్యవతి, సీపీఎం నేతలు బలరామ్‌, గోపాల్‌రావు సహా ఐద్వా నాయకురాలు కళ్యాణిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కంశాలి బేతపుడిలో ఉద్యమకారుడు త్రిమూర్తులుతో పాటు పలువురు మహిళలను అరెస్ట్‌ చేశారు. పోలీసుల అత్యుత్సాహంతో నరసాపురం, భీమవరం, మొగల్తురు మండలాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా దినోత్సవం రోజు మహిళలపై ప్రభుత్వ అణచివేత ధోరణిపై సర్వత్రా పలు విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.