బీజేపీలో వైసీపీ విలీనం- ఆర్కే విశ్లేషణ

ycp merge with bjp-andhra jyothi radha Krishna analysis

ycp merge with bjp-andhra jyothi radha Krishna analysis

కేసుల నుంచి బయిటపడేందుకు వైఎస్‌ఆర్‌సిపి అద్యక్షుడు జగన్‌ మోహనరెడ్డి కేంద్రంలోని బీజేపీతో విలీనం అయ్యే అవకాశముందని ఆర్కే కొత్త పలుకులో సూచన ప్రాయంగా రాశారు. ఇది వైసీపీ వారి నుంచి వచ్చిన భోగట్టా గానే ఆయన ప్రస్తావించడం విశేషం. వాస్తవానికి బీజేపి టీడీపీ వర్గాలే తరచూ ఈ కథను చెబుతుంటాయి. జగన్‌కు కేసుల నుంచి విముక్తి గనక ఏదైనా జరగొచ్చని వారి వాదన.

తెలకపల్లి రవి

ప్రత్యేకహోదా పోరాటంతో సహా పలు సందర్భాల్లో జగన్‌ కేంద్రాన్ని, బీజేపీని తీవ్రంగా విమర్శించని మాట నిజమే. టీడీపీపై ఒంటికాలిమీద లేచే జగన్‌ బీజేపీపై సన్నాయినొక్కులే నొక్కుతుంటారు. సీబీఐ బీజేపీ చేతిలో వుండటమే దీనికి కారణమని ఆ పార్టీ వారు చెబుతుంటారు. కాని దాన్ని విలీనం వరకూ తీసుకుపోవడం విపరీతమే. ఎందుకంటే పాలకపక్షమైన టీడీపీనే బీజేపీతో వున్నప్పుడు ప్రతిపక్షం కోసం దాన్ని వదులుకోవడమనే ప్రసక్తి వుండదు. కనీసం వచ్చే ఎన్నికల వరకూ బీజేపీ అలాటి దుస్సాహసం చేయదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎలా అదుపులో పెట్టుకోవడం అన్న ఆలోచన వారికి వుంది. వెంకయ్య నాయుడు ద్వారా అది జరిగిపోతున్నది.

వచ్చే ఎన్నికల నాటికి జగన్‌ కేసులు పూర్తవుతాయో లేదో ఏ జడ్జి ఎలా స్పందిస్తారో ఎవరూ చెప్పలేరు. కనుకనే జగన్‌ కూడా మరీ దీర్ఘకాలిక సమస్యలు విధానపరమైన అంశాల్లోకి పోకుండా ప్రతిపక్ష నేతగా ఆ సమయానికి తగిన మేరకు జోక్యం చేసుకున్నట్టు నిరసన తెల్పినట్టు కనిపిస్తున్నారు. ఆయన దూకుడుగా వున్నారు గనక బీజేపీ తనను తీసుకోవాలనుకోదు. అది కూడా ఈ దశలో. ఇక సామాజిక అంటే కుల మత పొందికను చూసినా వైసీపీకి ఓటు వేసే తరగతులకూ బీజేపీ సంఘ పరివార్‌కు బొత్తిగా పొసిగే అవకాశముండదు. ఆయన అటు వైపు వెళ్లిన మరుక్షణం వారు ఆ పార్టీకే దూరమవుతారు.

శాసనసభలో విష్ణుకుమార్‌ రాజు, కామినేని శ్రీనివాస్‌ వంటి వారు జగన్‌పై విరుచుకుపడే తీరుచూస్తే కూడా సయోధ్యకు అవకాశం కనిపించదు. కనక ఆర్కే అనుకున్నట్టు లేదా కొందరు ఆయనకు చెప్పినట్టు వైసీపీ బీజేపీలో విలీనం కాదనే చెప్పాలి. ప్రత్యేక హాదా నిరాకరించిందే బీజేపీ అయినప్పుడు దాంతో ప్రతిపక్ష నేత కలిస్తే ఆయన పరిస్థితి కూడా ప్రభుత్వంలో బీజేపీకి చోటిచ్చిన చంద్రబాబుతో సమానమవుతుంది. కనుకనే ఎన్ని చెప్పినా జగన్‌ బీజేపీతో తనకు సహజమైత్రి సాధ్యం కాదన్నట్టే వుంటున్నారు గాని చివరి మాట చెప్పి చర్చ నిలిపేయడం లేదు. ఏదో ఒకటి తన చుట్టూ చర్చ జరిగితే మంచిదన్న వ్యూహమై వుండొచ్చు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.