మహిళామంత్రులకే దిక్కులేదంటున్న రోజా

YSRCP Mla Roja fires on Chandrababu Naidu and AP Government on Capital issue

YSRCP Mla Roja fires on Chandrababu Naidu and AP Government on Capital issue

 

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబునాయుడు శాసనసభ సాక్షిగా మరో డ్రామాకు తెరలేపడమే కాకుండా, ఏపీ రాజధానిని సింగపూర్‌లా కడతామంటూ గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. రాజధానిలో డిజైన్లలో 51 శాతం గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకునే చంద్రబాబు ….మూడు పంటలు పండే 33వేల ఎకకాల భూమిని లాక్కుని ఎక్కడ నుంచో తెచ్చి చెట్లు పెడతానని చెవిలో కాలీఫ‍‍్లవర్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత రాజధానిలో చూసేందుకు ఓ చెట్టుకూడా లేదని ఆఖరికి మహిళా మంత్రులు, ప్రజా ప్రతినిధులు వెళ్లేందుకు సైతం టాయిలెట్లు కూడాలేని దౌర్భాగ్య స్థితిలో ప్రస్తుతం ఉన్నామని రోజా ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

రాజధానిపై ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు…సింగపూర్ డిజైన్లను గాలికొదిలేశారని, మాకీ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుని మరో సంస్థకు మార్చడం వెనుక మతలబు ఏంటో చెప్పాలని పట్టుబట్టారు. ఎవరితో చర్చించకుండానే చంద్రబాబు రాజధానిని ఎంపిక చేశారని, ఆనాడు రాజధాని ఎంపిక విషయంలో ప్రతిపక్షాన్ని, అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని రోజా సూటిగా ప్రశ్నించారు. గతంలో సింగపూర్‌ సంస్థతో కుదుర్చుకున్న సీల్డ్‌ కవర్‌ ఒప్పందాన్ని అసెంబ్లీలో ఎందుకు బయటపెట్టలేదని డిమాండ్‌ చేశారు. అలాగే రాజధాని డిజైన్లలో ఏపీ సర్కార్‌ తమతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంపై మకీ సంస్థ కేంద్రానికి ఫిర్యాదు చేసిందన్నారు. దానిపై ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడంలేదని ఆమె ప్రశ్నించారు.

ప్రజలకు చూపించాల్సింది బొమ్మలు కాదనీ, భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే రాజధాని కావాలన్నారు. శాశ్వత రాజధాని డిజైన్లను సభలో ప్రదర్శించాలని రోజా డిమాండ్‌ చేశారు. గొప్పలు చెప్పుకుంటూ డిజైన్ల పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగానే, పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు వైఎస్‌ఆర్‌ సీపీ హాజరు కాలేదని ఆమె తెలిపారు. మొదట సింగపూర్‌ డిజైన్లు, తర్వాత పొగ గొట్టాల డిజైన్లను తెర మీదకు తెచ్చారని, తాజాగా ఫోస్టర్‌ సంస్థ డిజైన్లపై ప్రజంటేషన్‌ ఇస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆ రెండు గ్రాఫిక్‌లను పక్కనపెట్టి ఇప్పుడు మూడో గ్రాఫిక్‌ను తెచ్చారని, దాన్ని కూడా ఖరారు చేస్తారో లేదో తెలియదన్నారు. రైతుల సమస్యలపై చర్చించాలని తాము కోరితే, గ్రాఫిక్‌ డిజైన్ల పేరుతో సభా సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.

Have something to add? Share it in the comments

Your email address will not be published.